దేశవ్యాప్తంగా కరోనా కేసులు ఆదివారంనాడు రికార్డు స్థాయిలో 841 పాజిటివ్‌లు నమోదయ్యాయి. దాదాపు ఏడు నెలల అనంతరం అత్యధిక కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 4,309కి చేరింది. కేరళ, కర్ణాటక, బీహార్‌లో ఒక్కొక్కరు చొప్పున ముగ్గురు కరోనా మృతి చెందారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బులెటిన్‌లో పేర్కొంది. జేఎన్.1 వేరియంట్ వైరస్ ప్రబలుతున్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు.
తొమ్మిది రాష్ట్రాల్లో జేఎన్.1 వ వేరియంట్ కేసులు 178 నమోదయ్యాయని, వీటిలో అత్యధికం గోవాలో 47, కేరళలో 41 పాజిటివ్‌లు ఉన్నాయని వివరించారు. గుజరాత్లో 36, కర్ణాటక 34, మహారాష్ట్ర 9, రాజస్థాన్, తమిళనాడులో నాలుగేసి కేసులు నమోదు కాగా, తెలంగాణలో 2, ఢిల్లిdలో 1 జేఎన్.1 వేరియంట్ కేసు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. కొవిడ్ వైరస్ వ్యాప్తి, మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. జనసమూహం ఉన్న ప్రాంతాల్లోకి వెళ్లేటప్పడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని హితువు పలికారు.