Saturday, November 23, 2024

డేటా సెంటర్లపై 81 వేల కోట్ల పెట్టుబడులు

మన దేశంలో డేటా సెంటర్లపై 2020 నుంచి ఇప్పటి వరకు 81,247 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. దేశంలో డేటా వినియోగం భారీగా పెరగడంతో ఈ సెంటర్లకు డిమాండ్‌ పెరిగిందని ప్రాపర్టీ కన్సల్టెంట్‌ కొలిరిస్‌ ఇండియా తెలిపింది. 2025 నాటికి దేశంలో డేటా సెంటర్లు 20 మిలియన్‌ చదరపు అడుగులకు మించి ఉంటాయని పేర్కొంది. ప్రస్తుత సామర్ధ్యం 10.3 మిలియన్‌ చదరపు అడుగులుగా ఉంది. మన దేశంలోని ముంబై, ఢిల్లి ఎన్‌సీఆర్‌, బెంగళూర్‌, చెన్నయ్‌, హైదరాబాద్‌, పూణే, కోల్‌కతా వంటి ప్రధాన నగరాల్లో 770 మెగావాట్ల సామర్ధ్యం ఉన్న డేటా సెంటర్లు ఉన్నాయి. డిజిటలైజేషన్‌ పెరుగుతుండంతో దేశంలో శరవేగంగా డేటా వినియోగం పెరుగుతోందని నివేదిక తెలిపింది.

గత రెండు సంవత్సరాలుగా దేశంలో డేటా సెంటర్లు ఏర్పాటు చేసే వారికి ప్రభుత్వాలు వివిధ రూపాల్లో ప్రోత్సహకాలు అందిస్తున్నాయి. సబ్సిడీ ధరలో భూములు కేటాయించడం, స్టాంప్‌ డ్యూటీ తగ్గింపు వంటివి ఇందులో ప్రధానమైనవి.
దేశంలో ముంబైలో అత్యధికంగా డేటా సెంటర్లు ఉన్నాయి. దేశంలో ఉన్న డేటా సెంటర్ల సామర్ధ్యంలో ఒక్క ముంబైలోనే 49 శాతం సెంటర్లు ఉన్నాయి. ఢిల్లి ఎన్‌సీఆర్‌లో 17 శాతం, దీని తరువాత స్థానం బెంగళూర్‌ది. గ్లోబల్‌ ఇన్వెస్టర్లు, డెవలపర్ల మధ్య జరిగిన ఒప్పందాల మూలంగా 2020 నుంచి ఇప్పటి వరకు 81,247 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇన్వెస్టర్లలో గ్లోబల్‌ సంస్థలతో పాటు, దేశంలోని కార్పోరేట్‌ సంస్థలు, రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు, ప్రైవేట్‌ ఈక్విటీ రూపంలోనూ పెట్టుబడులు వచ్చాయి. ప్రభుత్వాల ప్రోత్సహకాలు, పెరుగుతున్న డేటా వినియోగం వంటి కారణాల వల్ల వచ్చే రెండు, మూడు సంవత్సరాల పాటు వీటి వృద్ధి అధికంగానే ఉంటుందని నివేదిక పేర్కొంది.

ఈ రంగంలో పెట్టుబడులు దీర్ఘకాలం పాటు ఫలితాలు ఇస్తుంది. సెంటర్ల ఏర్పాటుకు అయ్యే ఖర్చు మొత్తం పెట్టుబడిలో 25 శాతం సెంటర్ల నిర్మాణానికి అవుతుంది. అందు వల్ల ఈ రంగంలో ఇన్వెస్టర్లకు మంచి అవకాశమని పేర్కొంది. పర్యావరణంపై ప్రభావం పడని, తక్కువ కార్బన్‌, మెరుగైన ఇంధన సామర్ధ్యం ఉన్న టెక్నాలజీస్‌లపై గ్లోబల్‌ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం టైర్‌ 2 నగరాల్లో కేవలం 3 శాతం డేటా సెంటర్లు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం మరిన్ని డేటా సెంటర్ల ఏర్పాటుకు ఉన్న అవకాశాలు ఉన్న నగరాలపై సంస్థలు దృష్టి సారించాయి. వీటిలో ముఖ్యమైనవి విజయవాడ, నాగపూర్‌, రాయ్‌పూర్‌, కొచ్చి, పాట్న, మంగళూరు వంటి నగరాల్లో డేటా సెంటర్ల ఏర్పాటుపై ఉన్న అవకాశాలను సంస్థలు పరిశీలిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement