న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: మునుగోడు ఉపఎన్నికల్లో సీఎం కే. చంద్రశేఖర రావు, మంత్రి కేటీ రామారావు అక్రమాలకు పాల్పడ్డారని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఆరోపించారు. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ అధికార తెలంగాణ రాష్ట్ర సమితిపై అనేక ఆరోపణలు చేశారు. ఎన్నికల అక్రమాలపై డాక్యుమెంటరీ ఆధారాలు, మీడియా కథనాలు, అధికారుల స్టేట్మెంట్లు అన్నీ కలిపి సాక్ష్యాధారాలుగా తాను ఎన్నికల సంఘానికి అందజేశానని చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఏర్పాట్లలో బిజీగా ఉన్నందున, ఆ ఎన్నికలు ముగిసిన తర్వాత చర్యలు తీసుకుంటామని ఈసీ అధికారులు చెప్పారని కేఏ పాల్ అన్నారు.
మునుగోడు ఉపఎన్నికల్లో ఎన్నికల విధుల్లో పాల్గొన్న అధికారులు సైతం అవినీతికి పాల్పడ్డారని కేఏ పాల్ ఆరోపించారు. మొత్తంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లనే మార్చేశారని ఆరోపించారు. లేదంటే గత ఎన్నికల్లో కేవలం 12 వేల ఓట్లు వచ్చిన భారతీయ జనతా పార్టీకి ఏకంగా 80 వేల ఓట్లు ఎలా వస్తాయని ప్రశ్నించారు. తనకు కేవలం 800 ఓట్లు మాత్రమే ఎలా వస్తాయని సందేహం వ్యక్తం చేశారు. కనీసం 30-40 వేల ఓట్లు వచ్చి ఉంటే అనుమానాలు కలిగేవికావని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో రాష్ట్ర, జిల్లా అధికారులు అనేక రకాలుగా అక్రమాలకు పాల్పడ్డారని, జిల్లా ఎస్పీ అధికార పార్టీ గూండాలా వ్యవహరించారని తీవ్ర విమర్శలు చేశారు.
ఎన్నికల అక్రమాలపై హైకోర్టులో లేదా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్టు పాల్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ మోసగిస్తున్నారని, కేసీఆర్, కేటీఆర్ లకు దేవుడి నుంచి, చట్టబద్ధంగా శిక్షలు తప్పవని హెచ్చరించారు. శనివారం హైదరాబాద్‌లోని ప్రజాశాంతి పార్టీ కార్యాలయంలో కేసీఆర్‌ను వ్యతిరేకించే పార్టీలతో సమావేశం నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు.