న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: లోక్‌సభ ఎన్నికల కోసం తెలంగాణ నుంచి నలుగురు పేర్లను ఇప్పటికే ప్రకటించిన కాంగ్రెస్ మిగతా 13 స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేసింది. మంగళవారం సాయంత్రం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో పార్టీ జాతీయాధ్యక్షులు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరిగిన కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (సీఈసీ) సమావేశంలో 9 స్థానాల విషయంలో ఏకాభిప్రాయం కుదిరినట్టు తెలిసింది. మరో 4 స్థానాల విషయంలో అధిష్టానం ఇంకా ఎటూ తేల్చుకోలేకపోయినట్టుగా కథనాలు వినిపిస్తున్నాయి. అత్యధిక స్థానాల్లో గెలిచి తీరడమే లక్ష్యంగా అభ్యర్థుల విషయంలో ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా బలాబలాలు, గెలుపు అవకాశాలు, ఆర్థిక స్థితిగతులను బేరీజు వేసుకోవడంతో పాటు ఆ అభ్యర్థి గురించి నియోజకవర్గంలో పార్టీ కేడర్ సహా సామాన్యుల నుంచి కూడా అభిప్రాయాలు తెలుసుకుంటున్నట్టు తెలిసింది.
ఈ మేరకు ఏఐసీసీ తెలంగాణలోని కొన్ని నియోజకవర్గాల్లో ఫ్లాష్ సర్వే నిర్వహించినట్టు సమాచారం. సర్వే నివేదిక ఆధారంగా అభ్యర్థులను ఖరారు చేస్తున్నట్టు తెలిసింది. మంగళవారం జరిగిన కాంగ్రెస్ సీఈసీ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న సికింద్రాబాద్‌పై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు సమాచారం. ఈ నియోజకవర్గంలో ఎలాగైనా గెలిచి తీరాలన్న ఉద్దేశంతో ఇతర పార్టీల్లోని బలమైన నేతలను పార్టీలో చేర్చుకున్న విషయం తెలిసింది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మేయర్‌గా పనిచేసిన బొంతు రామ్మోహన్ కాంగ్రెస్‌లో చేరిన తర్వాత ఆయనకే సికింద్రాబాద్ టికెట్ ఇస్తారన్న ప్రచారం జరిగింది. అయితే కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ నిర్వహించిన సమావేశంలో సికింద్రాబాద్ స్థానిక కాంగ్రెస్ కార్యకర్తల నుంచి వ్యతిరేకత వ్యక్తమైందని, ఈ క్రమంలో పార్టీలో చాలా కాలంగా పనిచేస్తున్న వేణుగోపాల స్వామితో పాటు పార్టీలో చేరిన విద్యావేత్త విద్యా స్రవంతి పేరు కూడా వినిపించింది. కిషన్ రెడ్డిని ఢీకొట్టేందుకు ఈ ఇద్దరూ సరిపోరని భావించిన రాష్ట్ర నాయకత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను పార్టీలో చేర్చుకుంది. సికింద్రాబాద్ సీటు విషయంలో దానం నాగేందర్, బొంతు రామ్మోహన్‌లలో ఒకరికి ఖరారు చేసే అవకాశం ఉంది. ఏఐసీసీ ఆదేశాల మేరకు జరిగిన ఫ్లాష్ సర్వేలో ఎవరికి ఎక్కువ స్కోర్ వస్తే.. వారికే టికెట్ ఇచ్చే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే భువనగిరి, ఖమ్మం నియోజకవర్గాల్లో పార్టీ నేతలు తమ కుటుంబీకులు లేదా వారసులకు టికెట్ ఇప్పించడం కోసం అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. భువనగిరి నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సన్నిహితుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి పేరును పరిశీలిస్తుండగా.. కోమటిరెడ్డి సోదరులు తమ కుటుంబ సభ్యుల కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. నల్గొండ స్థానాన్ని తొలి జాబితాలోనే సీనియర్ నేత జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి పేరును అధిష్టానం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో భువనగిరి సిట్టింగ్ ఎంపీ నుంచి రాష్ట్ర మంత్రివర్గంలో చేరిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన సోదరుడు మోహన్ రెడ్డి కుమారుడు సూర్యపవన్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నట్టు తెలిసింది.
ఇదే సీటు కోసం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన సతీమణి లక్ష్మికి ఇవ్వాలని కోరుతున్నట్టు తెలిసింది. వీరిలో ఎవరికి మొగ్గు ఉంటుందన్న అంశంపై ఫ్లాష్ సర్వేలో వచ్చిన ఫలితాలను బట్టి అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక ఖమ్మం సీటును తన సతీమణి నందినికి కేటాయించాలంటూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తన సోదరుడు ప్రసాద్ రెడ్డి కోసం గట్టిగా పట్టుబడుతున్నారు. ఈ ఇద్దరిలో అధిష్టానం ఎవరికి మొగ్గుచూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
చెవెళ్ల నియోజకవర్గం నుంచి పట్నం సునీత రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్టుగా ప్రచారం జరిగింది. ఏఐసీసీ విడుదల చేసిన తొలి జాబితాలోనే ఆమె పేరు ఉంటుందని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా తొలి జాబితాలోని 4 పేర్లలో చేవెళ్ల పేరు కనిపించలేదు. ఈలోగా సిట్టింగ్ ఎంపీ, బీఆర్ఎస్ నేత రంజిత్ రెడ్డి పార్టీలో చేరడంతో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని బరిలోకి దించడంతో ఆయన్ను ఓడించగలిగే సత్తా రంజిత్ రెడ్డికి మాత్రమే ఉందని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం భావించింది.
ప్రజల్లో రంజిత్ రెడ్డి పట్ల సానుకూలత ఉందని సర్వేలో గుర్తించినట్టు తెలిసింది. అందుకే చేవెళ్ల సీటును సిట్టింగ్ ఎంపీకే ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే ఆ సీటు నుంచి టికెట్ ఆశించిన పట్నం సునీత రెడ్డిని మల్కాజిగిరి నుంచి బరిలోకి దించేందుకు రాష్ట్ర నాయకత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ నియోజకవర్గం నుంచి మైనంపల్లి హనుమంత రావు పేరు వినిపించినప్పటికీ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినవారికి ఏడాది వరకు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేసే అవకాశం ఇవ్వవద్దని ఏఐసీసీ ఒక నిబంధనగా పెట్టిందని రాష్ట్ర నాయకత్వం చెబుతోంది. ఈ పరిస్థితుల్లో పట్నం సునీత రెడ్డిని మల్కాజిగిరి నుంచి బరిలోకి దించవచ్చు.
ఇదిలా ఉంటే వరంగల్ నియోజకవర్గం నుంచి బలమైన అభ్యర్థి కోసం కాంగ్రెస్ నాయకత్వం ఎదురుచూస్తోంది. నియోజకవర్గంలో చాలాకాలంగా సేవా కార్యక్రమాలు చేస్తున్న బొడ్డు సునీతను అభ్యర్థిగా పరిశీలిస్తున్నట్టు తెలిసింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న అద్దంకి దయాకర్ కూడా ఈ సీటు నుంచి పోటీ చేయాలని ఆశిస్తున్నట్టు తెలిసింది. ఫ్లాష్ సర్వే ఫలితం ఆధారంగా అభ్యర్థిని ఖరారు చేయనున్నట్టు ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. అలాగే ఇతర నియోజకవర్గాల విషయంలోనూ ఫ్లాష్ సర్వే నివేదికకే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. మంగళవారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో సాయంత్రం గం. 4.00 సమయంలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ప్రారంభం కాగా, తెలంగాణ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు సాయంత్రం గం. 6.00కు ప్రారంభమైంది.
ఖర్గే, సోనియా గాంధీ సహా కమిటీ సభ్యులందరూ హాజరైన ఈ భేటీకి తెలంగాణ తరఫున సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఈసీ సభ్యుడిగా ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. గంటన్నరకు పైగా సాగిన సమావేశంలో రాష్ట్రంలోని మిగిలిన 13 నియోజకవర్గాల అభ్యర్థుల గురించి చర్చించినట్టు తెలిసింది. ఎటూ తేల్చుకోలేకపోయిన 4 స్థానాలు మినహా మిగతా స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసి, బుధవారం దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణతో పాటు మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై ఏఐసీసీ కసరత్తు చేస్తోంది. అలాగే సిక్కిం, పశ్చిమ బెంగాల్, చండీగఢ్, అరుణాచల్ ప్రదేశ్, పుదుచ్చేరి, కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరిగింది.