వేములవాడ (ప్రభ న్యూస్) : ఒకే రోజులో 8 మోకాళ్ల మార్పిడి శస్త్ర చికిత్సలు విజయవంతంగా నిర్వహించి వేములవాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి చరిత్ర సృష్టించింది. ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ మహేష్ ఆధ్వర్యంలో డాక్టర్లు అనిల్, శశికాంత్ బృందం మోకాలి మార్పిడి చికిత్స లు నిర్వహించారు. ఈ ట్రీట్ మెంట్ తీసుకున్న రోగులు వేగంగా కోలుకుంటున్నారు. ఒక్కో మోకాలి మార్పిడి చికిత్స కు ప్రైవేట్ ఆసుపత్రిలో అయితే దాదాపు రూ.లక్ష 50 వేల రూపాయల నుంచి రూ.12 లక్షల దాకా ఖర్చు అవుతుంది. ఆ మొత్తాన్ని భరించలేక బాధను దిగిమింగుతూ పేద ప్రజలు ఇంతకాలం జీవనం సాగించారు.
వేములవాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి లో మోకాళ్ల మార్పిడి శస్త్ర చికిత్సలు ఉచితంగా చేస్తున్న సమాచారం వారికి చేరడంతో ఆసుపత్రికి వైద్యులను సంప్రదించగా విజయవంతంగా ఆపరేషన్ లు పూర్తి చేశారు. ఈ విషయాన్ని వేములవాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. కాగా ఇప్పటి వరకూ రికార్డ్ స్థాయిలో వేములవాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో 500 ఆర్థో శస్త్ర చికిత్సలు అనతికాలంలోనే నిర్వహించడం మరో రికార్డ్.