ట్విటర్‌లో బ్లూ టిక్‌ను పెయిడ్‌గా మారుస్తారని వచ్చిన ఊహాగానాలను నిజం చేస్తూ, ఇందు కోసం నెలకు 8 డాలర్లు వసూలు చేయాలని ట్విటర్ యాజమాన్యం నిర్ణయించింది. ట్విటర్‌ను కొనుగోలు చేసిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అనేక మార్పుులకు శ్రీకారం చుట్టారు. కంపెనీలో సీఈఓతో పాటు, ముఖ్యమైన అధికారులను తొలగించిన ఆయన, బోర్డు ఆఫ్ డైరెక్టర్లకు కూడా ఉద్వాసన పలికారు. ట్విటర్‌లో బ్లూ టిక్ కోసం నెలనెల డబ్బులు వసూలు చేయాలని నిర్ణయించినట్లు ఎలాన్ మస్క్ ప్రకటించారు.
అమెరికాలో నెలకు 8 డాలర్లు వసూలు చేస్తామని చెప్పిన ఆయన, ఈ ధర దేశాన్ని బట్టి మారుతుందని తెలిపారు. ఆయా దేశాల పర్చేజింగ్ పవర్ పారిటీకి అనుగుణంగా ధరను నిర్ణయిస్తామన్నారు. డబ్బులు చెల్లించే వారికి బ్లూ టిక్‌తో పాటు కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు కూడా ఉంటాయని తెలిపారు. స్పామ్‌ను నివారించేందుకు ఈ ఫీచర్లు అవసరమని పేర్కొన్నారు. ఎక్కువ నిడివి ఉన్న వీడియోలు, ఆడియోలు పోస్ట్ చేసేందుకు వెసులుబాటు ఉంటుదని తెలిపారు.
ప్రకటనలు సగానికి తగ్గుతాయన్నారు. తమతో ఒప్పందం చేసుకున్న పబ్లిషర్ల ఆర్టికల్స్‌కు పేవాల్ బైపాస్ కూడా ఉంటుందని వివరించారు. కొన్ని సంస్థలు అందించే పెయిడ్ కంటెంట్‌కు ఎలాంటి రుసుము లేకుండానే ట్విటర్‌లో చదివే వెసులుబాటు ఉంటుంది. ప్రముఖల ట్విటర్ ఖాతాలో పేరు కింద సెకండరీ ట్యాగ్ ఉంటుందని తెలిపారు. ఇలా మసకూరిన ఆదాయంతో కంటెంట్ క్రియేటర్లకు చెల్లించేందుకు ట్విటర్‌కు అవకాశం కలుగుతుందని చెప్పారు.
నెలకు 8 డాలర్లు వసూలు చేయాలన్న నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. వీటిని స్పందించిన ఎలాన్ మస్క్ ఎంత ఫిర్యాదు చేసిన బ్లూ టిక్ కోసం నెలకు 8 డాలర్లు చెల్లించాలని బదులిచ్చారు. ఆయన తన ట్విటర్ కంప్లైంట్ హట్‌లైన్ ఆపరేటర్‌గా మార్చుకున్నారు.
ఉద్యోగుల్లో ఆందోళన
ట్విటర్‌ను కొనుగోలు చేసిన నాటికి నుంచి వరసగా ఎలాన్ మాస్క్ తీసుకుంటున్న చర్యలతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. చాలా మంది ప్రత్యామ్నాయ ఉద్యోగాలను చూసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. సీఈఓ పరాగ్ అగర్వాల్‌ను ఇతర కీలక అధికారులను తొలగించిన తరువాత, ఇదే బాటలో మరికొంత మంది ప్రముఖులు కూడా కంపెనీ వీడాలని నిర్ణయించుకున్నారని వార్తులు వస్తున్నాయి. చీఫ్ కస్టమర్ ఆఫీసర్, ప్రకటన విభాగాధిపతి సారా సర్సొనెట్, చీఫ్ పీపుల్ అండ్ డైవర్సిటీ ఆఫీసర్ డలానా బ్రాండ్, కోర్ టెక్ జనరల్ మేనేజర్ నిక్ కాల్డ్‌వెల్, చీప్ మార్కెటింగ్ ఆఫీసర్ లెస్లీ బెర్లాండ్ తాజాగా కంపెనీని వీడిన వారిలో ఉన్నారని తెలుస్తోంది.
టెస్లా నుంచి కొంత మంది ముఖ్యులను ట్విటర్‌లో పని చేసేందుకు మస్క్ తీసుకున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఇందులో టెస్లా సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ బృందం డైరెక్టర్ అశోక్ ఎల్లుస్వామి వంటి వారు ఉన్నారు. నిషేధిత ఖాతలపై నిర్ణయం వాయిదా ట్విటర్‌లో గతంలో నిషేధానికి గురైన ప్రముఖుల ఖాతాల పునరుద్ధరించేందుకు మరికొంత సమయం పడుతుందని ఎలాన్ మస్క్ తెలిపారు. వీరిటో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముఖ్యులు. వీటిపై ఒక స్పష్టత వచ్చే వరకు గతంలో నిషేధానికి గురైన ఎవరి ఖాతాపైనైనా ఒక నిర్ణయానికి ఇప్పుడే రాలేమని ఆయన బుధవారం నాడు చేసిన ట్విట్‌లో పేర్కొన్నారు.
తన అభిప్రాయాలపై పౌరహక్కులు, ఉద్యమకారులతో సమావేశమైనట్లు ఆయన తెలిపారు. విద్వేషం, వేధింపులపై పోరాటం, ఎన్నికల సమగ్రతను కాపాడే పాలసీని కొనసాగిస్తామని ఆయన వెల్లడించారు. మస్క్ ట్విటర్ భద్రతను సామాజిక ప్రమాణాలను తగ్గించేందుకు ప్రయత్నిస్తే, ఆయా సంస్థలు వాణిజ్య ప్రకటనలు ఇవ్వొద్దని ఇప్పటికే 50 సంస్థలు లేఖ రాసాయి. ఎలాన్ మస్క్ చేతికి ట్విటర్ వచ్చాక విద్వేష ప్రచారాలు, తప్పుడు సమాచారం పెరిగిపోయిందని ఆ సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. మస్క్ దీన్ని కొనుగోలు చేయడంతో అతివాదులు సంబరాలు చేసుకుంటున్నారని ఆ లేఖలో పేర్కొన్నాయి.