హైదరాబాద్ మల్కాజ్‌గిరికి చెందిన ఓ 75 ఏళ్ల వృద్ధుడు 3 గంటల్లో 40 కిలోమీటర్ల మేర సైకిల్ తొక్కి శభాష్ అనిపించుకుంటున్నారు. రిటైర్డ్ రైల్వే ఉద్యోగి పాండే భార్య కొన్ని నెలల క్రితం మరణించింది. సాధ్యమైనంత వరకు తాను ఒంటరిని అనే ఫీలింగ్ లేకుండా బతకాలనుకున్నారు. అందుకోసం ఏదైనా చేయాలని పాండే నిర్ణయించుకున్నారు. దీంతో ఆ వృద్ధుడి దృష్టి సైక్లింగ్‌పై పడింది. ఈ క్రమంలో నగరంలో నిర్వహించిన పలు సైక్లింగ్ ఈవెంట్స్‌లో పాల్గొన్నారు. ఈ ఏడాది పంద్రాగస్టు రోజు నిర్వహించిన ఫ్రీడమ్ రైడ్‌లోనూ పాండే పాల్గొన్నారు. అలా సైక్లింగ్ పోటీల్లో పాండే పాల్గొంటూ మంచి నైపుణ్యాన్ని సంపాదించారు.
ఈ క్రమంలో ఆదివారం సఫిల్‌గూడ పార్క్ నుంచి చార్మినార్‌కు గంట సమయంలో సైకిల్‌పై వెళ్లారు. మళ్లీ చార్మినార్ నుంచి నెక్లెస్ రోడ్డు మీదుగా సఫిల్‌గూడ పార్క్‌కు రెండు గంటల్లో చేరుకోగలిగారు. అలా 3 గంటల్లో 40 కిలోమీటర్లు చుట్టేశాడు పాండే. ఈ రైడ్ పూర్తి చేసిన తర్వాత తనలో ఆత్మ విశ్వాసం పెంపొందిందని పాండే పేర్కొన్నారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా యువత నడుచుకోవాలని పాండే సూచించారు. కార్బన్ ఉత్పత్తులను తగ్గించాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. కాగా పాండే ప్రతి రోజు 40 నిమిషాల పాటు సైక్లింగ్, ఆరు నుంచి ఏడు కిలోమీటర్లు వాకింగ్ చేస్తారు. ఆయనకు కొన్నేండ్ల క్రితం మోకాళ్ల సర్జరీ కూడా అయింది. మిగతా సమయాల్లో 7 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఉచితంగా పాఠాలు బోధిస్తారు. తన భార్య బతికున్న సమయంలో ఈ పేద విద్యార్థులకు ట్యూషన్లు చెప్పేది. ఆమె చనిపోయిన తర్వాత ఆ బాధ్యతలను తాను తీసుకున్నానని పాండే చెప్పుకొచ్చారు.