Saturday, November 23, 2024

హిమాచల్‌లో 74శాతం పోలింగ్‌.. ఈశాన్య రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతం

హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లి ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 68 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్‌ జరిగింది. ఇవ్వాల (శనివారం) సాయంత్రానికి 74శాతం పోలింగ్‌ నమోదైందని ఎన్నికల అధికారులు ప్రకటించారు. షిల్లై (77) సిర్మౌర్‌ (72.35), సోలన్‌ (68.48), ఉనా (67.67), లాహౌల్‌ (67.5) సర్కాఘాట్‌ (55.4)లలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఓటింగ్‌ జరిగింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ప్రదేశంలోని పోలింగ్‌ కేంద్రంగా గుర్తింపు పొందిన లాహౌల్‌ అండ్‌ స్పితిలో గరిష్టంగా 98.8శాతం ఓటింగ్‌ నమోదైంది. ఇక్కడ మొత్తం 52 మంది ఓటర్లుండగా, 51 మంది కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ముందుకొచ్చారు.

ఓటు హక్కు వినియోగించుకున్నారు. సముద్ర మట్టానికి 15,256 అడుగుల ఎత్తులోని ఈపోలింగ్‌ కేంద్రాన్ని మోడల్‌ పోలింగ్‌ కేంద్రంగా తీర్చిదిద్దారు. వృద్దులు, వికలాంగులు సులభంగా ఓటేసేలా ఏర్పాట్లు చేశారు. చంబా జిల్లాలోని చాసక్‌ భటోరి పోలింగ్‌ స్టేషన్‌లో 80 ఏళ్ల వృద్ధురాలు ఓటేసింది. ఆమె ఏకంగా 14 కి.మీ. కాలినడకన పోలింగ్‌ కేంద్రానికి చేరుకుంది. రాష్ట్రంలోని 157 పోలింగ్‌ కేంద్రాలను మహిళలలే నిర్వహించారు.

ఉదయం ఓటింగ్‌ మందకొడిగా ప్రారంభమైంది. మొదటి గంటలో కేవలం 5శాతం మాత్రమే ఓట్లు పోలవగా, మధ్యాహ్నం సమయానికి 37శాతానికి పుంజుకుంది. మొత్తం 412 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, 55 లక్షల మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. 105 ఏళ్ల సరోదేవి, 103 ఏళ్ల ప్యార్‌సింగ్‌ పోలింగ్‌ బూత్‌కు వచ్చి ఓటేశారు. యువతరానికి స్ఫూర్తిగా నిలిచారు. హిమాచల్‌లో 80 ఏళ్లు పైబ డిన ఓటర్లు 1.21 లక్షల మంది ఉన్నారు. వీరిలో 1136 మంది శతాధిక వృద్ధులు కావడం విశేషం. అసెంబ్లి ఎన్నికల్లో పోటీచేస్తున్న ప్రముఖుల్లో ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్‌, మాజీ సీఎం వీరభద్రసింగ్‌ కుమారుడు విక్రమాదిత్య సింగ్‌, మాజీ బీజేపీ చీఫ్‌ సత్పాల్‌ సింగ్‌ తదితరులు ఉన్నారు.

భాజపా, కాంగ్రెస్‌ గెలుపు ధీమా..

బీజేపీ, కాంగ్రెస్‌మధ్య ప్రధాన పోరు జరిగింది. కొత్తగా ఆమ్‌ ఆద్మీ పార్టీ బరిలోకి దిగడంతో ఈసారి ఎన్నికలు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. వరుసగా రెండవ సారి అధికారం కోసం బీజేపీ ప్రయత్నించగా, ప్రతిపక్షం నుంచి అధికారపక్షం పాత్రలోకి వెళ్లాలనే సంకల్పంతో కాంగ్రెస్‌ సర్వశక్తులు ఒడ్డింది. ఢిల్లి, పంజాబ్‌లలో సత్తా చాటిన ఆప్‌, ఇరుగుపొరుగు రాష్ట్రాల్లోనూ పాగా వేయాలని పరితపిస్తోంది. హిమాచల్‌ ఎన్నికల్లోనూ వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుస్తామనే ధీమాతో ఉంది.

- Advertisement -

హిమాచల్‌ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఆనంద్‌ శర్మ అన్నారు. ఎమ్మెల్యేలను కొనడం ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే కలలు ఈసారి నెరవేరవని చెప్పారు. ఉద్యోగులు, యువత ప్రభుత్వం పట్ల అసహనంతో ఉన్నారని తెలిపారు. మరోవైపు బీజేపీ కూడా సంపూర్ణ మెజారిటీపై నమ్మకం పెట్టుకుంది. మరోసారి జైరాం ఠాకూర్‌ ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నద్దా చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement