Tuesday, November 26, 2024

ముసలోడు కాదు – మృత్యుంజయుడు

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం మసీదుగూడెం గ్రామానికి చెందిన విఘ్నేశాచారి సొంత పని మీద బైక్ తో చౌటుప్పల్ వచ్చాడు. 73సంవత్సరాల వయసు కలిగిన విఘ్నేశాచారి చౌటుప్పల్‌లోని అంగడిలో పని పూర్తి చేసుకొని స్వగ్రామానికి బైక్‌పై పయనమయ్యాడు. హైదరాబాద్‌, విజయవాడ నేషనల్‌ హైవే రోడ్డుపై సరిగ్గా ఆర్టీసీ బస్టాండ్‌ ముందు బైక్ యూ టర్న్ తీసుకుంటున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన రెడీమిక్స్ లారీ వెనుక నుంచి విఘ్నేశాచారి బైక్‌ని ఢీకొట్టింది. ఊహించని విధంగా లారీ ఢీకొట్టడంతో బైక్‌తో పాటు వృద్ధుడు లారీ ముందు చక్రాల మధ్యలో చిక్కుకుపోయాడు.కాగా ఆ వృద్ధుడు లారీ టైర్ల మధ్యలో బైక్‌తో సహా ఇరుక్కుపోవడం డ్రైవర్ గమనించలేదు.

దాంతో ముందుకు పోనిస్తుండగా అక్కడే ఉండి విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసు, స్థానికులు గట్టిగా అరవడంతో వారి కేకలు విని డ్రైవర్ బ్రేక్ వేశాడు. డ్రైవర్‌ చాకచక్యంగా స్లోగా బ్రేక్ వేయడం వల్లే విఘ్నేశాచారి ప్రాణాలతో బ‌తికి బ‌య‌ట‌ప‌డ్డాడు. వెంటనే స్థానికులు పరుగులు పెట్టి లారీ దగ్గరకు చేరుకున్నారు. లారీ టైర్ల మధ్యలో బైక్‌తో సహా చిక్కుకున్న వృద్ధుడ్ని సేఫ్‌గా బయటకు తీశారు. ఈప్రమాదంలో వేరే వాళ్లు ఉండి ఉంటే కచ్చితంగా చనిపోయి ఉండేవాళ్లని స్థానికులు తెలిపారు. 73సంవత్సరాల విఘ్నేశాచారి కాలికి మాత్రమే చిన్న గాయమైంది. రోడ్డుపై ఊడ్చుకుపోవడంతో కాస్త డోక్కుపోయిందని ఎలాంటి దెబ్బలు తగల్లేదని అతనే స్వయంగా చెప్పడంతో స్థానికులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. వృద్ధుడి ప్రాణాలు పోకుండా స్థానికుల అరుపులు విని నిదానంగా బ్రేక్ వేసి లారీని కంట్రోల్ చేసిన డ్రైవర్‌ని స్థానికులు అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement