న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కర్నూలు మెడికల్ కాలేజీలో రాష్ట్ర ప్రభుత్వం రూ. 120 కోట్లతో ఏర్పాటు చేస్తున్న కేన్సర్ ఇన్‌స్టిట్యూట్ కోసం కేంద్రం తన వాటా కింద కేంద్ర ప్రభుత్వం రూ.72 కోట్లు భరిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ మంగళవారం రాజ్యసభకు తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ కేన్సర్ చికిత్స కోసం దేశ వ్యాప్తంగా 19 రాష్ట్రాలలో కేన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లు, 20 టెరిటరీ కేర్ కేన్సర్ సెంటర్లు నెలకొల్పాలన్న నిర్ణయంలో భాగంగానే కర్నూలు మెడికల్ కాలేజీలో రాష్ట్ర స్థాయి కేన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు.
కేన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటు కోసం కర్నూలు మెడికల్ కాలేజీకి ఇప్పటి వరకు రూ. 54 కోట్లు ఆర్థిక సహాయం అందించినట్లు చెప్పారు. అలాగే మంగళగిరి ఎయిమ్స్‌లో కేన్సర్ చికిత్సలో భాగంగా సర్జికల్ ఆంకాలజీ, రేడియో థెరపీ సేవలను 2021లోనే ప్రారంభించగా ఎయిమ్స్‌లోని మెడికల్, సర్జికల్ స్పెషలిస్టులు అందరూ కేన్సర్‌కు చికిత్స అందిస్తున్నారని మంత్రి వెల్లడించారు.