Thursday, November 7, 2024

షాంఘైలో 70 శాతం మందికి కోవిడ్‌..

చైనాలోని షాంఘై నగరంలో ప్రస్తుతం హాస్పిటళ్లు కోవిడ్‌ రోగులతో నిండిపోతున్నాయి. ఆ నగరంలో దాదాపు 70 శాతం మందికి కోవిడ్‌ సోకి ఉంటుందని సీనియర్‌ డాక్టర్‌ ఒకరు తెలిపారు. డిసెంబర్‌లో కోవిడ్‌ ఆంక్షలను సడలించిన తర్వాత అక్కడ భారీ స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో హాస్పిటళ్లు, శ్మశానవాటికలు కిక్కిరిసిపోతున్నాయి. రుయిజిన్‌ హాస్పిటల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, షాంఘై కోవిడ్‌ అడ్వైజరీ ప్యానెల్‌ నిపుణుడు చెన్‌ ఎర్జన్‌ దీనిపై మాట్లాడారు. షాంఘైలో ఉన్న 2.5 కోట్ల మంది ప్రజల్లో.. చాలా మందికి వైరస్‌ సోకి ఉంటుందన్నారు. ఆ నగరంలో ప్రస్తుతం వైరస్‌ విస్తృతంగా వ్యాప్తి చెందుతోందని, జనాభాలో 70 శాతం మందికి ఆ వైరస్‌ సోకి ఉంటుందని, గత ఏప్రిల్‌, మే నెలలతో పోలిస్తే అది 20 నుంచి 30 శాతం అధికంగా ఉంటుందన్నారు. గత ఏప్రిల్‌లో షాంఘైలో కఠిన రీతిలో లాక్‌డౌన్‌ అమలు చేశారు.

ఆ సమయంలో సుమారు ఆరు లక్షల మందికి వైరస్‌ సోకింది. భారీ స్థాయిలో క్వారెంటైన్‌ సెంటర్లలో వాళ్లను లాక్‌ చేసిన విషయం తెలిసిందే. కానీ ప్రస్తుతం మళ్లిd ఒమిక్రాన్‌ వేరియంట్‌ పంజా విసురుతోంది. నగరంలో ఆ వేరియంట్‌ జోరుగా వ్యాపిస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో ఆ ఇన్‌ఫెక్షన్లు అధికంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. బీజింగ్‌, తియాంజిన్‌, చాంగ్‌కింగ్‌, గాంగ్‌జూ లాంటి నగరాల్లో ఇప్పటికే కోవిడ్‌ కేసులు తారా స్థాయికి చేరుకున్నాయి. రుయిజిన్‌ హాస్పిటల్‌లో ప్రతి రోజు 1600 ఎమర్జెన్సీ అడ్మిషన్లు జరుగుతున్నట్లు చెన్‌ ఎర్జన్‌ తెలిపారు. ప్రతి రోజు హాస్పిటల్‌కు వంద అంబులెన్సులు వస్తున్నట్లు చెప్పారు. 65 ఏళ్లు దాటిన వారంతా ఎమర్జెన్సీ విభాగంలో జాయిన్‌ అవుతున్నట్లు తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement