హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణలో వైద్య రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ అధిక శాతం ప్రజలకు వైద్య సేవలు ప్రైవేటు వైద్యులే అందిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఇంకా తీవ్రమైన వైద్యుల కొరత సమస్యను ప్రైవేటు వైద్యులే తీరుస్తుండటం గమనార్హం. ప్రస్తుతం రాష్ట్ర్రంలో 1100పైగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, దాదాపు 800 సబ్ సెంటర్లు ఉన్నాయి. ఇవి గ్రామీణ ప్రాంతాలలో ప్రజల వైద్య సేవలు తీర్చలేక పోతున్నాయి. దీంతో పాటు పిహెచ్‌సిలలో అధిక శాతం ఉదయం నుంచి సాయంత్రం వరకే పని చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వందల సంఖ్యలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్‌ను ప్రజలు ఆశ్రయించక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. ప్రజలకు రాత్రి వేళల్లో అత్యవసర వైద్య చికిత్సలను ప్రైవేట్ వైద్యులు మాత్రమే అందిస్తున్నారు.
అంతేకాకుండా సీజనల్ వ్యాధులు ప్రబలిన సమయంలో గ్రామీణ ప్రాంతాలలో 70 శాతం వైద్య చికిత్సలు ప్రైవేటు వైద్యులు నిర్వహిస్తున్నారు. కాగా, తెలంగాణ రాష్ట్ర్రంలో దాదాపు 20 వేల మంది ప్రైవేటు వైద్యులు ఆరోగ్యశ్రీ సేవలలో భాగస్వాములవుతున్నారు. తాజాగా, ఇండియల్ మెడికల్ అసోసియేషన్-తెలంగాణ శాఖ రాష్ట్ర వైద్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుతో భేటీ అయింది. ప్రభుత్వం గ్రామీణ వైద్య రంగాన్ని బలోపేతం చేయడానికి భారీగా చర్యలు చేపడుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సూపర్ స్పెషాలిటీ స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్స్‌ను ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తీసుకు రావాలని విజ్ఞప్తి చేసింది. ప్రైవేటు హాస్పిటల్స్‌లో వైద్యులు 24 గంటలూ అందుబాటులో ఉంటారనీ, దీంతో ప్రజలకు అత్యవసర సేవల్లో వైద్య సేవలు అందుతాయని పేర్కొంది.
మరోవైపు, వైద్య వృత్తినే నమ్ముకుని జీవిస్తున్న ప్రైవేటు వైద్యులకు ఆర్థికంగా కూడా సహకారం అందించినట్లవుతుందని వివరించింది. దీనిపై ఐఎంఏ తెలంగాణ శాఖ అధ్యక్షుడు డా.బిఎన్ రావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు వైద్యులు ఎప్పటికప్పుడు వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్న విషయాన్ని సైతం మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకువచ్చినట్లు చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య పథకాలలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రైవేటు వైద్యులు భాగస్వాములు అవుతున్నారనీ, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలని మంత్రి హరీష్ రావుకు విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు.