Thursday, November 21, 2024

అగ్నివీరుల్లో 70 శాతం ప‌ది విద్యార్థులే.. సర్వీసు పూర్తయ్యాక 12వ తరగతి సర్టిఫికెట్ ఇస్తాం : అనిల్ పురి

కేంద్రం తీసుకొచ్చిన కొత్త ప‌థ‌కం అగ్నివీర్ లో త్రివిధ దళాలకు ఎంపికయ్యే వారిలో దాదాపు 60-70 శాతం మంది ప‌ద‌వ‌త‌ర‌గ‌తి విద్యార్థులే ఉంటార‌ని సైనిక వ్యవహారాల విభాగం అదనపు కార్యదర్శి లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పురి తెలిపారు. వారి కాల పరిమితి ముగిసి బయటకు వచ్చే నాటికి వారి వయసు 21 నుంచి 25 ఏళ్ల లోపు ఉంటుందన్నారు. వారికి 12వ తరగతి సర్టిఫికెట్ జారీ చేస్తామని, ఆ తర్వాత వారు డిగ్రీ పూర్తి చేసేందుకు కూడా సాయం చేస్తామని అనిల్ పురి తెలిపారు. సైన్యంలో పనిచేసి బయటకు వచ్చిన వారికి పూర్తి క్రమశిక్షణ, నైపుణ్యం అలవడతాయని, కాబట్టి వారికి ఉద్యోగాలు దొరకడం కూడా సులభమవుతుందని చెప్పుకొచ్చారు. అగ్నివీరుల నాలుగేళ్ల కాలపరిమితి పూర్తయ్యాక 25 శాతం మందిని రెగ్యులర్ సర్వీసుల్లో చేర్చుకుంటామని, మిగిలిన వారికి కేంద్ర సాయుధ బలగాల్లో, రక్షణ శాఖ నియామకాల్లో 10 శాతం చొప్పున ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. అలాగే, వారికి పోలీసు శాఖలో ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలను కూడా కోరుతామన్నారు. అంతేకాదు, సర్వీసు అనంతరం బయటకొచ్చే యువకుల చేతుల్లో రూ. 11.70 లక్షలు ఉంటుందని, ఆ మొత్తంతో వారు ఏదైనా వ్యాపారం కూడా పెట్టుకోవచ్చని లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పురి వివరించారు. త్రివిధ దళాల్లో ప్రతి సంవత్సరం 17,600 మంది ముందస్తు పదవీ విరమణ పొందుతున్నారని, అగ్నిపథ్ వల్లే సైన్యం నుంచి ఎక్కువ మంది అర్ధాంతరంగా తప్పుకుంటున్నారన్న వాదనలో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement