Friday, November 22, 2024

Delhi | గత ఐదేళ్లలో 70 కొత్త కేంద్రీయ విద్యాలయాలు.. ఎంపీ నామ ప్రశ్నకు కేంద్రం జవాబు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: గత ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 70 కొత్త కేంద్రీయ విద్యాలయాలను మంజూరు చేసినట్టు కేంద్రం వెల్లడించింది. సోమవారం లోక్‌సభలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎంపీ నామ నాగేశ్వర రావు అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణ దేవి ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో ఈ వివరాలు వెల్లడించారు. అత్యధికంగా 2019-20లో 36 కేంద్రీయ విద్యాలయాలను మంజూరు చేసినట్టు తెలిపారు. కొత్తగా మంజూరైన 70 స్కూళ్లలో 11 స్కూళ్లు ఉత్తర్ ప్రదేశ్‌లో ఉండగా.. 9 మధ్యప్రదేశ్‌లో ఏర్పాటయ్యాయి. గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో 2, తెలంగాణలో 2 కేంద్రీయ విద్యాలయాలు మంజూరైనట్టు మంత్రి సమాధానంలో పేర్కొన్నారు.

కొత్తగా పాఠశాలలు ఏర్పాటైనంతగా వాటిలో టీచింగ్, నాన్-టీచింగ్ స్టాఫ్ భర్తీ జరగలేదని స్పష్టమవుతోంది. కేంద్రీయ విద్యాలయాల్లో ఉన్న ఖాళీలలపై నామ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. 2022-23 ఆర్థిక సవంత్సరం నాటికి మొత్తం అన్ని కేవీల్లో కలిపి 13,562 బోధనా సిబ్బంది పోస్టులు ఖాళీలున్నాయని, 1,772 మంది బోధనేతర సిబ్బంది పోస్టులు ఖాళీలు ఉన్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. రిటైర్మెంట్, రాజీనామాలు, పదోన్నతుల కారణంగా ఖాళీలు ఏర్పడుతున్నాయని, ఖాళీల భర్తీ కూడా నిరంతర ప్రక్రియ అని మంత్రి వెల్లడించారు. ప్రస్తుత ఖాళీల కారణంగా బోధనపై ప్రభావం పడకుండా కాంట్రాక్ట్ పద్ధతిలో టీచర్లను నియమించినట్టు వెల్లడించారు. అదే సమయంలో 13,411 బోధనా సిబ్బంది ఖాళీల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్ సైతం జారీ చేసినట్టు కేంద్ర మంత్రి తెలిపారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement