నాటో కూటమిలో చేరొద్దని హెచ్చరిస్తూ సైనిక చర్య పేరిట ఉక్రెయిన్‌పై ప్రారంభించిన యుద్ధం 70 రోజులు పూర్తయింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ అంచనాలకు భిన్నంగా ఉక్రెయిన్నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవడంతో వ్యూహం మార్చి దాడులు ముమ్మరం చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఉక్రెయిన్ రాజధాని లక్ష్యంగా యుద్దం ప్రారంభించిన రష్యా అనూహ్యంగా ఎదురుదెబ్బలు తింది. భారీగా ప్రాణ, ఆయుధాలు, వాహనాలను నష్టపోయింది. మరోవైపు ఉక్రెయిన్‌కు అమెరికా సారథ్యంలోని నాటో కూటమి దేశాలు పెద్దఎత్తున ఆయుధ సంపత్తిని అందించడంతో రష్యాపై ఎదురుదాడి చేస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఉక్రెయిన్ రాజధాని కీవ్‌నుంచి వెనక్కు మళ్లిన రష్యా బలగాలు తూర్పు, ఉత్తర ప్రాంతాలపై విరుచుకుపడుతున్నాయి. ఎట్టకేలకు అతిపెద్ద పారిశ్రామిక, నౌకాశ్రయం ఉన్న మరియపోల్ పట్టణాన్ని, క్రిమియా సరిహద్దుల్లో ఉన్న దాన్బోస్ ప్రాంతాన్ని చేజిక్కించుకోగలిగిన రష్యాకు అక్కడ కూడా స్వల్ప స్థాయిలో ప్రతిఘటన ఎదురవుతోంది. మరియపోల్ నగరమంతా స్వాధీనం చేసుకోగలిగినప్పటికీ అక్కడి అతిపెద్ద స్టీల్‌ప్లాంట్ అజోవత్సల్ లోపలివైపున ఉన్న ఉక్రెయిన్ సైనికులు లొంగడం లేదు.
రష్యా దాడులు చేస్తున్నప్పటికీ వారు ప్రతిఘటిస్తున్నారు. అదే కర్మాగారంలో సాధారణ పౌరులు కూడా తలదాచుకుంటుండగా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియకు, రష్యా దాడుల వల్ల ఆటంకం ఏర్పడుతోంది. తాజాగా గురువారం కూడా రష్యా వైమానికి దళానికి చెందిన హెలికాఫ్టర్లు స్టీల్‌ప్లాంట్‌పై నిప్పులు కురిపించాయి. వీలు చిక్కినప్పుడల్లా అక్కడి పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరియపోల్‌లో ప్రజలను భయభ్రాంతులను చేయడానికి రష్యా కుటిల యత్నాలు సాగిస్తోందని, ఉన్నట్లుండి సైరన్లు మోగించడం, దాడులు చేయడం, వేరే ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రచారం చేస్తూ ప్రజల నైతికస్థయిర్యాన్ని దెబ్బతీసేందుకు రష్యా ప్రయత్నిస్తోందని ఉక్రెయిన్ ఆరోపించింది. కాగా ఉక్రెయిన్‌కు నాటో దేశాలు సరఫరా చేస్తున్న ఆయుధాలను చేరవేస్తున్న రైల్వే మార్గాల్లోని ఐదు రైల్వే స్టేషన్లపై దాడులు చేసినట్లు రష్యా సైన్యం ప్రకటించింది. జల, వాయు మార్గాల్లో క్షిపణులు ప్రయోగించి విద్యుత్ సరఫరా వ్యవస్థలను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. ఉక్రెయిన్‌లోని కిరోవోహ్రాద్ ప్రాంతంలోని కనటోవో వైమానిక స్థావరంలోని ఏవియేషన్ వ్యవస్థలను క్షిపణులతో పేల్చివేశామని, మైకోలైవ్‌లో ఆయుధ డిపోను ధ్వంసం చేశామని రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. ఈ దాడుల్లో 600 మంది ఉక్రెయిన్ ఫైటర్లు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది. మరోవైపు ఉక్రెయిన్‌కూడా రష్యాపై ఎదురు దాడి చేస్తోంది. రష్యా భూభాగంలోని బెల్గొరొడ్ లోని అనేక గ్రామాలపై దాడులు చేసినట్లు ప్రకటించింది. ఝురవ్ లెవ్కా, నెకోటీవ్కా గ్రామాల్లో అనేక ఇళ్లు ధ్వంసమైనాయని వెల్లడించింది.