Saturday, November 23, 2024

Delhi | 7 రెట్లు పెరిగిన నగదు సీజ్ ఘటనలు.. ఫలిస్తున్న ఈఎస్ఎంఎస్ విధానం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే డబ్బు, మద్యం సహా ఇతర పద్ధతులపై కేంద్ర ఎన్నికల సంఘం అనుసరిస్తున్న సరికొత్త విధానం సత్ఫలితాలనిస్తోంది. ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టం (ఈఎస్ఎంఎస్) ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల మధ్య సమన్వయం సాధిస్తూ ఎన్నికల అక్రమాలకు కేంద్ర ఎన్నికల సంఘం అడ్డుకట్ట వేస్తోంది. ఐదేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే ప్రస్తుతం జరుగుతున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం సీజ్ చేసిన మొత్తం 7 రెట్లు పెరిగిందని కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది.

మిజోరాంతో, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు తేదీలు ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ. 1,760 కోట్ల మేర నగదు, మద్యం, డ్రగ్స్, ఖరీదైన బహుమతులను సీజ్ చేసినట్టు ప్రకటించింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీజ్ చేసిన మొత్తం రూ. 239.15 కోట్లతో పోల్చితే ఇది 7 రెట్లు పెరిగిందని గణాంకాలతో సహా వెల్లడించింది.

- Advertisement -

ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు డబ్బు, మద్యం, డ్రగ్స్, ఖరీదైన బహుమతుల రూపంలో జరుగుతున్న పంపిణీపై గట్టి నిఘా పెట్టేందుకు, చర్యలు తీసుకునేందుకు తాము అందుబాటులోకి తెచ్చిన ఈఎస్ఎంఎస్ విధానం ఉపయోగపడుతోందని తెలిపింది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మేఘాలయం, త్రిపుర, కర్ణాటక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ రూ. 1,400 కోట్ల మేర నగదు, మద్యం, బహుమతులను పట్టుకున్నామని, గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే ఇది ఏకంగా 11 రెట్లు అధికమని ఈసీ వివరించింది.

ఎన్నికల అక్రమాలతో పాటు ఎన్నికల్లో అభ్యర్థులు, పార్టీలు చేస్తున్న ఖర్చుపై నిఘా పెట్టి సమయానుకూలంగా చర్యలు తీసుకోవడంలో ఈఎస్ఎంఎస్ పోర్టల్ క్షేత్రస్థాయి నుంచి కేంద్ర ఎన్నికల సంఘం వరకు కీలకంగా మారిందని ఈసీ తెలిపింది. నిఘా సంస్థలు, దర్యాప్తు సంస్థలు, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల మధ్య సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటూ సమన్వయంతో చర్యలు చేపట్టేలా దోహదపడుతోందని వివరించింది.

ఎన్నికల వ్యయంపై పర్యవేక్షణ కోసం 228 మంది అనుభవజ్ఞలైన ఐఆర్ఎస్, ఐఆర్ఏఎస్, ఐడీఏఎస్, సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్ అధికారులను నియమించినట్టు తెలిపింది. అదే సమయంలో క్షేత్రస్థాయి నుంచి ఈ పర్యవేక్షణ అమలు చేసేందుకు తగినంత సిబ్బందిని నియమించినట్టు పేర్కొంది. ముఖ్యంగా డబ్బు, మద్యం తదితర రూపాల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా అడ్డుకట్టే వేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement