టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ సంపద భారీగా పడిపోయింది. స్టాక్ మార్కెట్లో నెలకొన్న ప్రతికూల పరిస్థితులతో గత వారం ఎలాన్ మస్క్ నికర సంపద పడిపోయింది. ఏకంగా ఒక వారంలోనే 1.7 లక్షల కోట్లు కరిగిపోయింది. బ్లూమ్బర్గ్ బిలియనీర్ సూచి ప్రకారం ప్రస్తుతం ఆయన సంపద 156.9 బిలియన్ డాలర్లుగా ఉంది దీంతో రెండో స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న అమెజాన్ అధినేత కంటే ఎలాన్ మస్క్ సంపద 20 బిలియన్ డాలర్లు తక్కువ
2020 కరోనా సంక్షోభంతోపాటు విద్యుత్ కార్లకు డిమాండ్ పెరగడంతో విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లా సీఈవో ఎలన్‌మస్క్ గతేడాది భారీ సంపదను పోగేసుకుని రికార్డు సృష్టించారు. కానీ కరోనా అనంతరం ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి అమెరికా సర్కార్ విడుదల చేసిన బాండ్ల కొనుగోలు కోసం పెట్టుబడిదారులు పోటీ పడుతున్నారు. ఫలితంగా స్టాక్ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులతో టెస్లా షేర్లు పతనం అయ్యాయి. ఈ క్రమంలో గత నాలుగు వారాల్లో మస్క్ సంపద ఊహించిన దానికంటే భారీగా దిగజారుతూ వచ్చింది. టెస్లా కంపెనీ షేర్ల విలువ నాలుగు వారాల్లో 230 బిలియన్ డాలర్ల మేరకు పడి పోయింది. ఈ ఒక్క వారంలోనే సంస్థ షేర్ల విలువ 11 శాతం పతనమైంది. 2019 మే తర్వాత ఈ స్థాయిలో టెస్లా షేర్ పతనం కావడం ఇదే తొలిసారి. ప్రస్తుతం టెస్లా కంపెనీ మార్కెట్ విలువ 574 బిలియన్ డాలర్లుగా ఉంది.