Saturday, November 2, 2024

Delhi | దేశ‌రాజ‌ధానిలో 69శాతం కుటుంబాలకు ఆరోగ్య సమస్యలు..

మామూలుగానే ఢిల్లి కాలుష్య రాజధాని. ఇక దీపావళి వస్తే కాలుష్యం మరింత పెరుగుతుంది. ఈసారి కూడా అదే జరిగింది. దీపావళి రోజుల్లో ఢిల్లి – నేషనల్‌ కేపిటల్‌ రీజియన్‌ ప్రాంతంలో 69 శాతం కుటుంబాలు అనారోగ్యానికి గురైనాయని తాజా అధ్యయనంలో తేలింది.

ఆ కుటుంబాల్లో కనీసం ఒకరు లేదా ఇద్దరు చొప్పున తీవ్ర అస్వస్థతకు గురైనట్లు గుర్తించారు. ప్రత్యేకించి కళ్లు మంటలు (62శాతం మంది), శ్వాసకోశ సమస్యలు (31 శాతం), గొంతునొప్పి, జలుబు, కఫం, దగ్గు, ఆందోళన (23 శాతం) వంటి సమస్యలతో వారు సమతమయ్యారు.

ఢిల్లిలోని చాలా ప్రాంతాలలో దీపావళి నాడు రాత్రి కాలుష్యం రికార్డుస్థాయికి, వాయు నాణ్యత బాగా దెబ్బతింది. ఏక్యూఐ 999గా నమోదైంది. ఢిల్లి – ఎన్‌సీఆర్‌ రీజియన్‌లో 21వేల మందినుంచి వివరాలు సేకరించి సర్వే నిర్వహించారు. నగర జనాభాలో కనీసం 15 శాతం మంది నిద్రపట్టక ఇబ్బంది పడ్డారు. మిగతా నగరాలతో పోలిస్తే ఢిల్లిలో కాలుష్యం చాలా ఎక్కువ. సాధారణంగా ఇక్కడ ఏక్యూఐ 300-500 మధ్య ఉంటుంది.

దీపావళి నాడు ఇది రెట్టింపయ్యింది. మునుముందు కాలుష్యం మరీ పెరిగిపోతుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై 10,630 మందినుంచి అభిప్రాయాలు సేకరించగా వారిలో 15 శాతం మంది ఆ సమయానికి నగరాన్ని వీడి వేరే ప్రాంతానికి వెళ్లాలనుకుంటున్నట్లు వెల్లడించారు.

ఇంటిపట్టునే ఉండి మంచి ఆహారం, ద్రవ పదార్థాలు తీసుకుని రోగనిరోధక శక్తిని పెంచుకుంటామని 9 శాతంమంది చెప్పగా 23 శాతం మంది గాలి నాణ్యతను పెంచే ఎయిర్‌ ప్యూరిఫైర్‌లను వాడతామని చెప్పారు. ఇక సామాన్యులు మాత్రం మాస్క్‌లతో గడిపేస్తామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement