హైదరాబాద్, ఆంధ్రప్రభ : కాకతీయుల కళాతృష్ణకు కలికితురాయిగా నిలిచి, ప్రపంచవారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన రామప్ప ఆలయ సుందరీకరణ, పునరుద్దరణ పనుల్లో కేంద్ర, రాష్ట్ర పురావస్తు,పర్యాటక శాఖలు నిమగ్నమయ్యాయి. ఆలయ శిల్పసంపదను శాస్త్రీయ పద్ధతుల్లో భద్రంగా కాపాడేందుకు అవసరమైన చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది. యునెస్కో గుర్తింపుతో అంతర్జాతీయ పర్యాటక ప్రాంతంగా భాసిల్లుతున్న రుద్రేశ్వరాలయం(రామప్ప) సుందరీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. మరో వేయి సంవత్సరాల పాటు ఆలయాన్ని భద్రపరిచి భావితరాలకు అందించేందుకు పురావస్తు శాఖ పనుల్లో నిమగనమైంది. ప్రధానంగా ఆలయంలోని శిల్పాలను పర్యాటకులు తాకకుండా వేదికలను నిర్మించి ప్రదర్శించేందుకు ప్రస్తుతం ఉన్న వేదికలతో పాటుగా మరికొన్ని వేదికలు నిర్మించాలని పురావస్తు శాఖ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.
అలాగే ఈ ఆలయంలో మాత్రమే ఉన్న అరుదైన నల్లరాతి మదనిక శిల్పాల నకళ్లను తయారుచేసి భద్రపర్చాలని కేంద్ర పురావస్తుశాఖ నిర్ణయించింది. భవిష్యత్తులో ప్రకృతి వైపరిత్యాలు సంభవించి శిల్పాలకు ప్రమాదంఏర్పడితే పునరుద్ధరణకు ఈ నకళ్లు ఉపయోగపడతాయని పురావస్తు శాఖ అధికారి చెప్పారు. ప్రధానంగా ఈ ఆలయంలో ఏనుగుల వరుస కు ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. గర్భగుడిలోని మూలవిరాట్టును దర్శించుకునే మార్గాన్ని చూపుతూ ఏనులుగు వరుసగా వెళ్లడం దీనిప్రత్యేకత. ఈ ఎనుగుల గుంపుతో పాటుగా ఇతర చారిత్రిక ప్రాధాన్యత గల శిల్పాలను మైక్రో ఫిలింలో భద్రపరిచే పనులు వేగంగా జరుగుతున్నాయి.
గుడి పైకప్పులో సుందరీమణుల శిల్పాలకు కాకతీయ వాస్తు రీతుల్లో ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆనాటి మహిళలు వేదాలను పటించేవారనీ, ఎత్తు చెప్పులు ధరించే వారని ఈశిల్పాల్లో స్పష్టంకావడంతో కాకతీయుల నాటి నాగరికతను, శిల్పరీతులను భద్రపరిచేందుకు పురావస్తు శాఖ సిద్ధమైంది. రామప్ప ఆలయ సుందరీకరణ,మౌలిక సదుపాయాల కోసం కేంద్రప్రభుత్వ పర్యాటక శాఖ ప్రసాద్ పథకం కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ. 61కోట్ల 99 లక్షల మంజూరు చేసింది. ఈ నిధులతో అభివృద్ధి డీపీఆర్ లను రూపొందించి కేంద్ర పురావస్తు శాఖ పనులు ప్రారంభించింది.
ఈ పనుల్లో ల్యాండ్ స్కేపింగ్, యాంఫీథియేటర్, ఫౌంటేన్ నిర్మాణం, కంపౌండ్ వాల్, శిల్పాలకోసం పీఠాలు, శిల్పాల నకళ్లు, కాకతీయ శైలిలో ముఖ ద్వార నిర్మాణం తదితర పనులు కొనసాగుతున్నాయి. అలాగే 3డి ప్రొజెక్షన్ మ్యాపింగ్ సీసీటివీ నిఘా వ్యవస్థలు, జాతీయ రహదారి మార్గాల అనుసంధానం తదితరపనులు నిర్మాణంలో ఉన్నాయి. వీటితో పాటుగా రామప్ప చెరువు సుందరీకరణ కు పర్యాటక శాఖ నిధులు మంజూరు చేయడంతో పాటుగా పర్యాటకులకోసం బోటింగ్, స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. రామప్పఆలయం సుందరీకరణతో పాటుగా పర్యాటకులను ఆకట్టుకునేందుకు అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే వివిధ ప్రాంతాలనుంచి టూరిజం ప్రత్యేక ప్యాకేజీలో ప్రయాణ సౌకర్యాలను ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అయితే యునెస్కో గుర్తింపు లభించగానే పర్యాటకుల తాకిడి పెరగడంతో వారికి తగ్గట్టుగా సౌకర్యాలను మెరుగు పర్చేందుకు కేంద్రపర్యాటక శాఖ నమగ్నమైంది. కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడు పాలనలో నాటి సైనికాధికారు రేచర్ల రుద్రుడు నిర్మించిన రుద్రేశ్వర ఆలయమే నేటి రామప్ప ఆలయం. ఈ ఆలయాన్ని 31మార్చి 1213లో ప్రారంభించినట్లు శాసనాధారం ఉంది. ఆరోజుల్లో కాకతీయ సామ్రాజ్యాన్ని సందర్శించిన ఇటలీ యాత్రికుడు మార్కొపోలో తనరచనల్లో రుద్రేశ్వరాలయాన్ని ప్రస్థావించారు. దేవాలయాల గెలాక్సిలో ప్రకాశవంతమైన నక్షత్రం ఈ ఆలయమని మార్కోపోలో పేర్కొన్నారు. అనంతరం ప్రతాపరుద్రుని కాలంలో 1323ఢిల్లి సుల్తానుల దండయాత్రలో కాకతీయ సామ్రాజ్యం పతనమైంది.
ఆతర్వాత క్రమేణ ఈ ఆలయానికి ఆదరణ కరువై శిథిలావస్థలోకి వెళ్లిపోయింది. అనంతరం క్రీ.శ. 1829లో 3వ నిజాం సికిందర్ జా ఈ ప్రాంతానకి వేటకు వెళ్లినప్పుడు రామప్పఆలయం, రామప్ప చెరువును చూసి ఆశ్చర్యపోయారు. తక్షణ మరమ్మత్తులకోసం ఆజ్ఞాపించడంతో కాకతీయుల అనంతరం 606 సంవత్సరాలకు రామప్పటెంపుల్ ప్రచారంలోకి వచ్చింది. ఆతర్వాత రాష్ట్ర పురావస్తు శాఖ, కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలో పదిలపర్చగా 2021లో యునెస్కో ప్రపంచవారసత్వ ప్రదేశంగా గుర్తింపు ఇవ్వడంతో నాటి కాకతీయ రాజులను తలపిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలయ అభువృద్ధిలో నిమగ్నమైనప్పటికీ ఇంకా వెలుగులోకి రానీ, అభివృద్ధికి నోచుకోని అనేక ప్రాచీన కట్టడాలు తెలంగాణలో అనేకం ఉన్నయి.