అదాని ఎంటర్‌ప్రైజెస్‌కు అనుబంధంగా ఏర్పాటు చేయనున్న కుచ్ కాపర్ లిమిటెడ్‌కు ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు 6,071 కోట్ల రూపాయిల రుణం ఇవ్వనున్నాయి. రెండు దశల్లో ఈ కార్మాగారాన్ని 10 లక్షల టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్ధ్యంతో నెలకొల్పనున్నారు. గుజరాత్‌లోని ముంద్రాలో గ్రీన్ ఫీల్డ్ కాపర్ రిఫైనరీని ఏర్పాటు చేస్తున్నట్లు అదాని ఎంటర్ ప్రైజెస్ తెలిపింది. మొదటి దశలో 5లక్షల టన్నుల సామర్ధ్యంతో ఏర్పాటు చేసే కాపర్ రిఫైనరీకి పైనాన్షియల్ క్లోజర్ పూర్తయినట్లు కంపెనీ తెలిపింది. ఎస్‌బీఐ ఆధ్వర్యంలోని బ్యాంక్‌ల కన్సార్టియం ప్రాజెక్ట్‌కు కావాల్సిన రుణాన్ని సమకూర్చనుంది.
ఇందులో ఎస్‌బీఐతో పాటు బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఉన్నాయి. మొదటి దశ కోసం బ్యాంక్‌లు 6,071 కోట్ల రుణం ఇచ్చేందుకు ఒప్పందంపై సంతకాలు చేశాయని కంపెనీ తెలిపింది. మొదటి దశ ఉత్పత్తి 2024 మొదటి త్రైమాసికంలో మొదలవుతుంది. మొత్తం పూర్తయితే ప్రపంచంలోనే అతి పెద్ద కాపర్ కంపెనీల్లో ఇది ఒకటిగా ఉంటుందని అదాని ఎంటర్‌ప్రైజెస్ తెలిపింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.