చైనాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ముఖ్యంగా జీరో కొవిడ్ విధానం ఎత్తివేసిన తర్వాత వైరస్ వ్యాప్తి వేగవంతం అయింది. డిసెంబర్ ప్రారంభంలో ఆంక్షలు సడలించిన నాటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 60వేల మంది కోవిడ్ సంబంధిత సమస్యలతో మరణించారు. 35 రోజుల వ్యవధిలో 59,938 మరణాలు నమోదైనట్లు చైనా ఆరోగ్య అధికారులు శనివారం అధికారిక ప్రకటనలో వెల్లడించారు. నేషనల్ హెల్త్ కమిషన్ ఆధ్వర్యంలోని బ్యూరో ఆఫ్ మెడికల్ అడ్మినిస్ట్రేషన్ అధిపతి జియావో యాహుయ్ ఈ మేరకు విలేకరుల సమావేశంలో వాస్తవిక గణాంకాలను విడుదల చేశారు. వైరస్ కారణంగా నేరుగా శ్వాసకోశ వైఫల్యం వల్ల సంభవించిన 5,503 మరణాలతోపాటు, కోవిడ్‌తో కలిపి అంతర్లీన వ్యాధుల వల్ల 54,435 మరణాలు సంభవించాయని జియావో చెప్పారు.
అయితే ఈ సంఖ్య వైద్య సదుపాయాల వద్ద నమోదు చేయబడిన మరణాలను మాత్రమే సూచిస్తుంది. దేశవ్యాప్తంగా సంభవించిన కొవిడ్ మరణాలు ఇంకా ఎక్కువే ఉండొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. మృతుల సగటు వయస్సు 80.3 ఏళ్లు కాగా, మృతుల్లో 65 సంవత్సరాలు పైబడిన వారు 90 శాతానికి పైగా ఉన్నారు. చాలా మంది అంతర్లీన పరిస్థితులతో బాధపడుతున్నారని వారు చెప్పారు. చైనాలో 60 ఏళ్లు పైబడిన లక్షలాది మందికి టీకాలు వేయలేదు.
రాబోయే రెండు నెలలు ప్రమాదకరమే..
చైనాలో ప్రతిరోజూ లక్షల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. జీరో కొవిడ్ విధానాన్ని ఎత్తివేయడంతో భారీగా కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలోనే జనవరి 11 నాటికి చైనా వ్యాప్తంగా 90 కోట్ల మందికి కరోనా సోకినట్లు పెకింగ్ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడైంది. 141 కోట్ల డ్రాగన్ దేశ జనాభాలో ఇది సుమారు 64 శాతం. అత్యధికంగా గాన్సు ప్రావిన్స్‌లో 91 శాతం మంది వైరస్ బారిన పడినట్లు అధ్యయనంలో వెల్లడైంది. ప్రావిన్స్ తర్వాత యూనాన్ ప్రాంతంలో 84 శాతం, కింఘై లో 80 శాతం మంది ప్రజలు వైరస్ బారిన పడినట్లు పేర్కొంది.
కాగా, చైనా వ్యాప్తంగా మరో 2-3నెలల వరకు కొవిడ్ గరిష్ఠ స్థాయిలో ఉంటుందని అంటువ్యాధుల నిపుణులు అంచనా వేశారు. ఇది గ్రామీణ ప్రాంతాలకు కూడా వ్యాపించే అవకాశం ఉందని ##హచ్చరించారు. ఈ నెల 22వ తేదీన చైనీయులు కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకోనున్నారు. ఆంక్షలు ఎత్తివేయడంతో కోట్లాది మంది సొంతూళ్లకు పయనమవుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే రెండు, మూడు నెలలు కేసులు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేశారు.