Monday, November 25, 2024

కొవిడ్‌ పరిహారం దరఖాస్తుకు, 60 రోజుల గడువు

కొవిడ్‌-19తో మరణించిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. పరిహారం కోసం దరఖాస్తు చేసుకునేందుకు నిర్ణీత గడువు విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 20వ తేదీకి ముందు చోటుచేసుకున్న కొవిడ్‌ మరణాలకు సంబంధించి 60 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. భవిష్యత్తులో చోటుచేసుకునే కొవిడ్‌ మరణాలకు మాత్రం బాధిత కుటుంబాలకు 90 రోజుల్లోగా దరఖాస్తుకు అనుమతి ఇవ్వాలని భారత అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుంటుంబాలు పరిహారం పొందే విషయంపై మార్చి 24వ తేదీన సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కొవిడ్‌ పరిహారం కోసం బాధిత కుటుంబాలకు నెల రోజుల గడువు ఇవ్వనున్నట్లు కేంద్రం చేసిన ప్రతిపాదన సరిపోదని సుప్రీంకోర్టు గత నెలలో అభిప్రాయపడింది. కుటుంబ సభ్యులను కోల్పోయిన విషాదం నుంచి బాధితులు కోలుకొని, పరిహారం కోసం దరఖాస్తు చేసుకోవడానికి సమయం పడుతుందని పేర్కొంది. మార్చి 20తేదీకి ముందు జరిగిన కొవిడ్‌ మరణాలకు 60 రోజుల గడువు, భవిష్యత్తులో సంభవించే వాటికి 90 రోజుల గడువు ఇవ్వాలని జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ బి.వి.నాగరత్నల ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది. మరోవైపు పరిహారం కోసం వచ్చే నకిలీ అభ్యర్థనలను గుర్తించేందుకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ కసరత్తును చేపట్టాలని పేర్కొంది.

ఇదిలా ఉంటే, కరోనా మృతుల కుటుంబాలు పరిహారం కోసం దరఖాస్తు చేసుకునేందుకు కచ్చితమైన గడువును నిర్దేశించాల్సిన అవసరం ఉందని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా సుప్రీం కోర్టుకు సూచించారు. స్పష్టమైన గడువు లేకుండా పరిహార ప్రక్రియను నిరంతరంగా కొనసాగించడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకున్న సుప్రీం ధర్మాసనం.. కొవిడ్‌ బాధితుల దరఖాస్తుకు 60 రోజులు గడువు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement