Friday, November 22, 2024

ఒక‌టోత‌ర‌గతిలో చేరాలంటే ఆరేళ్లు ఉండాల్సిందే…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: పాఠశాలల్లో అడ్మిషన్లకు సంబంధించి కేంద్రం కొత్త రూల్‌ను తీసుకొచ్చింది. ఒకటో తరగతిలో చేర్చుకునే చిన్నారులకు కనీసం ఆరేళ్ల వయస్సు ఉండాలనే నిబంధనను అమలు చేయాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. కనీసం ఆరేళ్ల వయస్సు ఉంటేనే ఒకటో తరగతిలో చేర్చుకొవాలని, ఈ నిబంధన అమలయ్యేలా చూడాలని ఈమేరకు రాష్ట్రాలు, కేంద్ర ప్రాంత ప్రాంతాలకు ఉత్తర్వులు జారీ చేసింది. నూతన విద్యావిధానంలో ఈ నిబంధన ఉన్న విషయాన్ని కేంద్ర విద్యాశాఖ గుర్తు చేసింది. ఈ నిబంధన ప్రకారం మూడేళ్ల నుంచి ఎనిమిదేళ్ల మధ్య ఉన్న పిల్లలకు ఫౌండేషన్‌ స్టేజ్‌లో భాగంగా విద్య నేర్పాల్సి ఉంటుందని కేంద్రం తెలిపింది.


ఇందులో మూడేళ్ల నుంచి ఐదేళ్ల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు ప్రీ-స్కూల్‌ ఎడ్యుకేషన్‌ ఉంటుంది. ఆటపాటలతో చదువుపై ఆసక్తి కలిగించేలా ప్రీ-స్కూల్‌ విద్య ఉంటుందని కేంద్రం ఆ ఉత్తర్వుల్లో పొర్కొంది. ఆ తర్వాత ఒకటి, రెండో తరగతులు ఫౌండేషన్‌ దశలో ఉంటాయి. అయితే ఒకటో తరగతిలో చేరే ముందే చిన్నారులకు నాణ్యమైన ప్రీస్కూల్‌ విద్య అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు కేంద్ర విద్యాశాఖ సూచించింది. ఆయా రాష్ట్రాల్లో ఉన్న వయస్సు నిబంధనను నూతన విద్యా విధానానికి అనుగుణంగా మార్చుకోవాలని స్పష్టం చేసింది. దేశ విద్యా వ్యవస్థను సమూలంగా మార్చేందుకు కేంద్రం నూతన విద్యా విధానాన్ని తీసుకొస్తోంది. ఈ నూతన విద్యా విధా నంలో బట్టి చదువులను స్వస్తిపలికి సృజనాత్మకతకు పెద్ద పీట వేయడమే తమ లక్ష్యంగా కేంద్రం ముందుకు వెళ్తోంది.

ఈక్రమంలోనే ప్రస్తుతం ఉన్న ప్రాథమిక ఉన్నత విద్య రూపురేఖలు మార్చేస్తోంది. ఇప్పటి వరకూ విద్యా విధానం 10 ప్లస్‌ 2 ప్లస్‌ 3గా ఉండగా, దాన్ని 5 ప్లస్‌ 3 ప్లస్‌ 3 ప్లస్‌ 4గా మార్చింది. ఆర్ట్స్‌, సైన్స్‌ విద్య మధ్య విభజన లేకుండా నచ్చిన సబ్జెక్టులు ఎంపిక చేసుకునేలా వెసులుబాటును కల్పించేలా నూతన విద్యా విధానం రూపొందించింది. జాతీయ విద్యావి ధానంలో భాగంగా పాఠశాలల్లోనూ ప్లే స్కూల్స్‌ ఏర్పాటు చేస్తామని కేంద్రం గతంలోనే ప్రకటించింది. సమగ్రశిక్షా అభియాన్‌ 2.0 కింద ప్లేస్కూల్‌ ఏర్పాటు చేసి ఉపాధ్యాయులకు తగిన శిక్షణ ఇవ్వనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.

ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్లు పొందే చిన్నారులు ఐదేళ్లకు బడిబాట పడుతున్నారు. ఐదేళ్ల వయస్సున్న వారిని ఒకటో తరగతిలో అడ్మిషన్లు ఇస్తున్నారు. అదే ప్రైవేట్‌ స్కూళ్లల్లోనైతే 3 లేదా 4 ఏళ్లకు నర్సరీ ఎల్‌కే జీలో చేర్పిస్తున్నారు. ప్రైవేట్‌ స్కూళ్లలోనైతే ఆరేళ్లు వచ్చేసరికి చిన్నారులు ఒకటో తరగతిలోనే ఉంటు న్నారు. కానీ ప్రభుత్వం బడుల్లో మాత్రం ఐదేళ్లకే ఒకటో తరగతిలో చేరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement