హైదరాబాద్, ఆంధ్రప్రభ: గ్రూప్-4 పరీక్షల తేదీని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) ప్రకటించింది. జూలై 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు గురువారం వెల్లడించింది. అయితే ఈసారి గ్రూప్-4 పరీక్షకు చాలా గ్యాప్ ఇచ్చింది. చదువుకునేందుకు దాదాపు 6 నుంచి 7 నెలల సమయం ఇచ్చింది. ఇది అభ్యర్థులకు బాగా కలిసొచ్చే అంశం. చదువుకునేందుకు, రివిజన్ చేసుకునేందుకు చాలా సమయం ఉంటుంది. గతంలో ఎన్నడూ కూడా నోటిఫికేషన్‌కు పరీక్ష మధ్య ఇన్ని నెలల సమయం దాదాపు ఏ ఉద్యోగ నోటిఫికేషన్‌కు ఇవ్వలేదు. అభ్యర్థులు పూర్తిస్థాయిలో పరీక్షకి సన్నద్ధత కావడానికి మంచి సమయం లభించిందనే చెప్పాలి. ఒకట్రెండు నోటిఫికేషన్లు మినహా మెజార్టీ నోటిఫికేషన్‌లకు గతంలో కేవలం 3 నుంచి 4 నెలల్లోపు మాత్రమే సమయమిచ్చేవారని తెలంగాణ రాష్ట్ర డీఎడ్ బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రావుల రామ్మోహన్ రెడ్డి తెలిపారు. సమయం తక్కువగా ఇవ్వడంతో సిలబస్ పూర్తి చేసేందుకు అస్సలు సమయమే ఉండేది కాదు. పోటీ పరీక్షలు రాయాలంటే ఒకట్రెండు సార్లు రివిజన్ చేస్తేగానీ గుర్తుండే పరిస్థితి ఉండదు.
అయితే ఒక నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత దాదాపు 45 రోజుల తర్వాత ఎప్పుడైనా పరీక్షను నిర్వహించవచ్చు. కానీ రాష్ట్రంలో భారీగా నోటిఫికేషన్లు వెెలువడడంతో అన్ని నియామక పరీక్షలకు తగిన విధంగా వ్యవధి(గ్యాప్) ఉండేలా టీఎస్‌పీఎస్‌సీ అధికారులు జాగ్రత్తులు తీసుకొని పరీక్ష తేదీలను ప్రకటిస్తున్నారు. చాలా ఏళ్ల తర్వాత రాష్ట్రంలో ఈ స్థాయిలో ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు జారీ కావడంతో అర్హత ఉన్న ప్రతీ అభ్యర్థి అన్ని రకాల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. దీంతో ఏ ఒక్క అభ్యర్థి నష్టపోకుండా దరఖాస్తు చేసిన ప్రతీ పరీక్షను రాసేలా జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి పరీక్ష తేదీలను, సెలవు దినాలను పరిగణలోకి తీసుకొని పోటీ పరీక్ష తేదీలను ప్రకటిస్తున్నారు.
డిసెంబర్ 1వ తేదీన గ్రూప్-4 నోటిఫికేషన్‌ను కమిషన్ జారీ చేసింది. గతంలో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం జనవరి 30వ తేదీతో దరఖాస్తు గడువు ముగియడంతో ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గడువును ఇటీవల పెంచింది. అయితే మార్చి, ఏప్రిల్ నెలలో గ్రూప్-4 పరీక్షను నిర్వహించడం కుదరదు. టెన్త్, ఇంటర్ పరీక్షలు ఉంటాయి. టెన్త్, ఇంటర్ పరీక్షలు ముగిస్తేనే గ్రూప్-4 పరీక్షకు పరీక్ష కేంద్రాలు దొరికే పరిస్థితి. మే 28న సివిల్స్ సర్వీస్ ప్రిలిమ్స్ పరీక్షలు ఉన్నాయి. జూన్ నెలలో తెలంగాణ ఫార్మేషన్ డే, గ్రూప్-1 మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష, యూజీసీ నెట్, యూపీఎస్‌సీ ఐఈసీ, ఐఎస్‌ఎస్, ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామ్స్, సీఏ ఇంటర్మీడియట్ తదితర పరీక్షలు ఉన్నాయి.
జూలై 2న, 16న యూపీఎస్‌సీ పరీక్షలు ఉన్నాయి. జూలై 1న మాత్రం ఖాళీ ఉండడంతో అదే రోజున గ్రూప్-4 పరీక్షను నిర్వహించేందుకు కమిషన్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఇలా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్ వరకు వివిధ జాతీయ, రాష్ట్ర ప్రవేశ పరీక్షలు, పోటీ పరీక్షలు, సెలవు దినాలు ఉండడంతో ఏ రోజున ఖాళీ ఉందో దాన్ని చూసుకొని పరీక్షల తేదీలను నిర్ణయిస్తున్నారు. టీఎస్‌పీఎస్‌సీ ఈ క్యాలెండర్ ప్రకారంగానే గ్రూప్-2, 3 పరీక్ష తేదీలను నిర్ణయించనుంది.
ఒకే రోజు రెండు పేపర్లు…
జూలై 1న రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్-4 పరీక్షలు నిర్వహించనున్నారు. ఒకేరోజు రెండు పేపర్లను నిర్వహిస్తారు. ఉదయం 10 గంట నుంచి మధ్యాహ్నం 12.30 గంట వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్షను నిర్వహించనున్నారు. ఇప్పటి వరకు 9,08,061 దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. తెలుగు, ఉర్దూ, ఇంగ్లష్ భాషల్లో ఈ పరీక్ష ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో 8,180 పోస్టులకు నియామక ప్రక్రియను చేపడుతోంది. శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉండడంతో 10 లక్షల వరకు దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈనేపథ్యంలో గ్రూప్-4కు భారీ పోటీ నెలకొంది. గ్రూప్-2, 3 కూడా గ్రూప్-1, 4 పరీక్షల తర్వాత నిర్వహించాలని అధికారులకు తెలంగాణ రాష్ట్ర డీఎడ్ బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రావుల రామ్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.