బెజ్జూర్, ఏప్రిల్ 27(ప్రభ న్యూస్) : 6 గ్యారెంటీలు అమలు చేసి తీరుతామని తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. బెజ్జూరు మండల కేంద్రంలో శనివారం కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మంత్రి సీతక్క హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో పోడు భూముల సమస్య పూర్తిగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రైతుబంధు పూర్తిస్థాయిలో అమలు చేస్తామని, ఎన్నికల కోడ్ ఉన్నందున పలు అభివృద్ధి పథకాలు అమలు కావడం లేదన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, గత కాంగ్రెస్ హయాంలో పనులు ప్రారంభించినట్లు ఆమె తెలిపారు. బీజేపీ మతాల పేరుతో రాజకీయం చేస్తుందని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా నియోజకవర్గానికి మూడు వేల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలను ప్రతి ఇంటికి అందేలా కార్యకర్తలు కృషి చేయాలన్నారు. కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి సుగుణ ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకొని ప్రజాసేవ చేసేందుకు ముందుకు వచ్చిందని, ఆదివాసి గిరిజన బిడ్డను తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మాట్లాడుతూ… ఆదివాసి పేదలకు పెళ్లిళ్లు చేయడం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని, ఎంపీ అభ్యర్థి సుగుణకు ఓటు వేసి గెలిపించేందుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు.
ఎంపీ అభ్యర్థి సుగుణ మాట్లాడుతూ… ప్రజా సేవ చేసేందుకు ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకొని మీ ముందుకు వచ్చానని, మీరు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిరిపూర్ నియోజకవర్గ ఇన్చార్జి రావి శ్రీనివాస్, గణపతి, ఓం ప్రకాష్, సిడం సకారం, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, కాంగ్రెస్ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.