Tuesday, November 26, 2024

Network: వచ్చే నెలలో 5జీ సేవలు ప్రారంభం.. కాల్‌ రేట్లుపై ఇంకా రాని స్పష్టత

వచ్చే నెల నుంచి 5జీ సేవలు ప్రారంభిస్తామని ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌, జియో ఇప్పటికే ప్రకటించాయి. వేలంలో 5జీ స్పెక్ట్రమ్‌ను దక్కించుకున్న సంస్థలు ఈ సేవలను ప్రారంభించనున్నాయి. 5జీ సర్వీస్‌ల రేట్లు ప్రారంభంలో 4జీ మాదిరిగానే ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు, పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కొంత కాలం వినియోగదారులకు 5జీ స్పీడ్‌ను అస్వాధించిన తరువాత క్రమంగా కంపెనీలు వీటి రేట్లను సవరించే అవకాశం ఉందని వీరు అంచనా వేస్తున్నారు.

ఎక్కువ మంది యూజర్లుకు ఆకర్షించేందుకు ఈ విధానాన్ని అనుసరించే అవకాశం ఉందని వీరు చెబుతున్నారు. 4జీ నుంచి కస్టమర్లను 5జీకి మళ్లించడం టెలికం సంస్థలకు అత్యంత ముఖ్యం. ముందుగా యూజర్లు 4జీ, 5జీకి మధ్య డేటా వేగంలో స్పష్టమైన తేడాను గుర్తించే వరకు ఇదే వ్యూహాన్ని టెలికం కంపెనీలు అనుసరించే అవకాశం ఉంది.

అన్ని టెలికం కంపెనీలు మందుగా పెద్ద నగరాల్లోనే 5జీ సేవలను ప్రారంభించనున్నాయి. పట్టణ ప్రాంతాల్లో యూజర్ల సంఖ్య పెరిగితే రేట్లు క్రమంగా పెంపుదల చేస్తారు. టెలికం కంపెనీలకు బ్రిటన్‌ అనుభవం పనికి వస్తుంది. 5జీ సేవలను ప్రవేశపెట్టిన సమయంలో యూకేలో టెలికం కంపెనీలు రేట్లు పెంచి ప్యాకేజీలు ప్రకటించాయి. దీని వల్ల అక్కడి 4జీ వినియోగదారులు 5జీ సర్వీస్‌ల పట్ల ఆసక్తి చూపించలేదు. దీంతో అక్కడి కంపెనీలు అధిక రేట్లను వెనక్కి తీసుకున్నాయి.

ఈ అనుభవంతో మన దేశ టెలికం కంపెనీలు ప్రారంభంలో 4జీ రేట్లతో సమానంగా 5జీ సర్వీస్‌లు అందించే అవకాశం ఉంది. రేట్లు పెంచితే కస్టమర్లు ఆసక్తి చూపించకపోవచ్చు. మరో వైపు 5జీ సర్వీస్‌లకు అనుగుణంగా 5జీ ఫోన్ల అమ్మకాలు కూడా పెరగాల్సి ఉంది. ప్రస్తుతం మార్కెట్‌లో 5కోట్ల 5జీ ఫోన్లు ఉన్నట్లు ప్రముఖ ఏజెన్సీ సీఎల్‌ఎస్‌ఏ నివేదిక అంచనా వేసింది. 2025 నాటికి ఈ ఫోన్ల సంఖ్య 25 కోట్లకు పెరిగే అవకాశం ఉందని ఈ నివేదిక తెలిపింది. 5జీ సేవలు తక్కువ ధరలో లభ్యమైతేనే 5జీ ఫోన్ల అమ్మకాలు పెరుగుతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement