దేశంలో టెలికం, సమాచార రంగంలో అత్యాధునిక ఐదవ తరం శకం ప్రారంభమవుతోంది. 4జి కన్నా పదిరెట్ల వేగంతో సేవలందించే 5జి (ఫిఫ్త్ జనరేషన్) రేడియో తరంగాల (స్పెక్ట్రమ్) వేలం కార్యక్రమం మంగళవారం ప్రారంభం కానుంది. దేశంలో పేరుమోసిన టెలికం సంస్థలు వేలంలో పాల్గొనేందుకు ఆసక్తితో ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో 4జి సేవలం విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి. దానికన్నా పదిరెట్ల వేగంతో 5జి పనిచేస్తుంది. 3జితో పోలిస్తే 30 రెట్లవేగంతో సేవలందుతాయి. ప్రస్తుతం ఒక చిన్నపాటి ప్రాంతంలో కొద్దిపాటి సంఖ్యలో మొబైల్స్, ఇతర డివైస్‌లకు మాత్రమే సేవలందించగలిగేవారు. వాటి సంఖ్య పెరిగే కొద్దీ సేవల్లో వేగం తగ్గిపోయేది. కానీ 5జి అందుబాటులోకి వస్తే అలాంటి సమస్యలు ఉండబోవు. కొద్దిపాటి ప్రాంతంలో కూడా ఎక్కువ సంఖ్యలో కనెక్షన్లు ఇవ్వొచ్చు.
అందువల్ల వేగంలో ఏమాత్రం మార్పులు చోటుచేసుకోబోవని నిపుణులు గట్టిగా చెబుతున్నారు. ఇక ఆర్థిక లావాదేవీల రంగంలో పెనుమార్పులు చోటు చేసుకోనున్నాయి. కన్నుమూసి తెరిచేలోగా చెల్లింపులు పూర్తి చేయొచ్చు. ప్రస్తుతం దేశంలో స్మార్ట్ పేమెంట్ల జోరందుకున్న విషయం తెలిసిందే. అయితే, తరచూ సేవల్లో అంతరాయం, జాప్యం, సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. 5జి అందుబాటులోకి వస్తే అలాంటి సమస్యలకు అవకాశం ఉండదు. అలాగే ఇంటర్నెట్ సేవలు మరింత సులభంగా, వేగంగా అందుబాటులోకి వస్తాయి. డేటా, ఫోటోలు, వీడియోల డౌన్‌లోడింగ్ సమయం బాగా తగ్గిపోతుంది. ఎంత భారీ ఫైల్ అయినా క్షణాల్లో డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు 5జీతో అందుబాటులోకి వస్తుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.