అంతర్జాతీయ కార్ల తయారీ సంస్థ టెస్లా డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రికార్డు స్థాయి ఆదాయాన్ని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే లాభాల్లో 59శాతం వృద్ధి నమోదైంది. వార్షిక ప్రాతిపదికన డిసెంబర్ త్రైమాసికంలో లాభాలు 3.69 బిలియన్ డాలర్లకు చేరాయి. ఒక్కో షేరుపై 1.19 డాలర్ల లాభం వచ్చినట్లు కంపెనీ తెలిపింది. ప్రస్తుత త్రైమాసికంలో ఆదాయం 24.32 బిలియన్ డాలర్లకు చేరినట్లు కంపెనీ పేర్కొంది. త్రైమాసిక ఫలితాలు అంచనాలను మించాయని వెల్లడించింది. కంపెనీ ఆటోమోటివ్ విభాగం స్థూల లాభాలు మాత్రం 30.6 శాతం నుంచి 25.9 శాతానికి తగ్గినట్లు టెస్లా తెలిపింది.
ప్లాంట్ల మూసివేత, విడిభాగాల సరఫరాలో సమస్యల వంటి సవాళ్లు ఎదురైనప్పటికీ ఈ త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలను ప్రకటిస్తున్నట్లు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వ్యాఖ్యానించారు. అతిపెద్ద మార్కెట్లయిన అమెరికా, చైనాలో కొన్ని మోడళ్ల ధరలను 20 శాతానికి పైగా తగ్గించామని చెప్పారు. ఇతర వాహన కంపెనీలతో పోల్చిచూస్తే, ఈ ఏడాది మరిన్ని లాభాలు వస్తాయని అంచనా వేస్తోంది. సాఫ్ట్‌వేర్ తదితర అదనపు ఆదాయాల కారణంగా భవిష్యత్ లాభాలు మెరుగ్గా ఉంటాయని తెలిపింది.