Wednesday, December 25, 2024

Air Strikes – ఆఫ్ఘనిస్థాన్‌పై పాకిస్థాన్ వైమానిక దాడి..

కాబూల్ – ఆఫ్ఘనిస్థాన్‌పై పాకిస్థాన్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఆఫ్ఘనిస్థాన్‌లోని పక్టికా ప్రావిన్సులోని బర్మాల్ జిల్లాను లక్ష్యంగా చేసుకుని జరిపిన ఈ దాడుల్లో మహిళలు, చిన్నారులు సహా 15 మంది వరకు మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంద‌ని భ‌య‌ప‌డుతున్నారు..
అక్క‌డ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మొత్తంగా ఏడు గ్రామాలపై దాడులు జరిగాయి. లమన్ గ్రామంలో జరిగిన దాడిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

కాగా, పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఇటీవలి కాలంలో ఉద్రిక్తతలు పెరిగాయి. తమ భూభాగంలో జరుగుతున్న ఉగ్ర దాడులకు తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) కారణమని, తాలిబన్ ప్రభుత్వం వారికి ఆశ్రయం ఇస్తోందని పాక్ పదే పదే ఆరోపిస్తోంది. అయితే, ఈ ఆరోపణలను ఆఫ్ఘనిస్థాన్ ఖండిస్తోంది. తెహ్రీక్-ఈ-తాలిబాన్ పాకిస్థాన్‌ ఇటీవలి కాలంలో పాక్ దళాలపై దాడులను మరింత పెంచింది. ఈ నేప‌థ్యంలోనే , సరిహద్దుకు సమీపంలో ఉన్న తాలిబాన్ రహస్య స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు సైనిక సన్నిహిత భద్రతా వర్గాలు చెబుతున్నాయి.

పాక్ దాడులను తాలిబన్ రక్షణ మంత్రిత్వశాఖ ఖండించింది. తమ భూభాగాన్ని, సార్వభౌమత్వాన్ని రక్షించుకోవడం తమ చట్టబద్ధమైన హక్కు అని పేర్కొంది. మృతుల్లో ‘వజిరిస్థానీ శరణార్థులు’ కూడా ఉన్నట్టు తెలిపింది. తాజా దాడుల్లో మరణించిన వారందరూ పౌరులేనని పేర్కొంది. ఈ దాడుల‌కు ప్ర‌తికారం తీర్చుకుంటామ‌ని తాలిబాన్ లు పాక్ ను హెచ్చ‌రించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement