ఒడిశా: భద్రక్ జిల్లాలోని కాంతిగన్ గ్రామానికి చెందిన స్వర్ణలత ఏడో తరగతి వరకు మాత్రమే చదివింది. ఆమెకు అప్పుడే వివాహమైంది. దీంతో విద్యకు దూరం కావాల్సి వచ్చింది. ఇద్దరు పిల్లలు కలిగిన తర్వాత 27 ఏండ్ల వయసులో భర్తను కోల్పోయింది. జాబ్ కోసం ఏ కంపెనీ చుట్టూ తిరిగిన ఆమెకు విద్యార్హత లేకపోవడంతో ఉద్యోగం దొరకలేదు. ఈ క్రమంలో ఆమె సొంత గ్రామంలోని పాఠశాలలో వంట మనిషిగా ఉపాధి దొరికింది. నెలకు రూ. 100 జీతంగా వచ్చేది. ఆ సంపాదనతోనే కుటుంబాన్ని పోషించేది. 2005లో స్వర్ణలత ఆశా వర్కర్‌గా నియామకమైంది. ఆశా వర్కర్‌గా విధులు సమర్థవంతంగా నిర్వర్తించినందుకు జిల్లా స్థాయిలో ఆమెను ఎన్నో అవార్డులు వరించాయి. పిల్లలను పీజీ స్థాయి వరకు చదివించింది.
అయితే 2019లో ఒడిశా ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఆశా వర్కర్లుగా కొనసాగాలంటే కచ్చితంగా పదో తరగతి పాస్ కావాలన్న నిబంధన విధించింది. దీంతో స్వర్ణలత మళ్లీ పుస్తకాలతో కుస్తీ పట్టాల్సి వచ్చింది. పాఠశాలలో వంట మనిషిగా, గ్రామానికి ఆశా వర్కర్‌గా కొనసాగుతూనే.. పదో తరగతి పరీక్షలకు ఆమె సిద్ధమైంది. 2019, డిసెంబర్లో ఓపెన్ టెన్త్ ఎగ్జామ్స్‌కు ఫీజు కట్టింది. 2020, మార్చిలో ఎగ్జామ్స్ నిర్వహించాల్సి ఉండగా, కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. అదే ఏడాది సెప్టెంబర్‌లో నిర్వహించిన ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అయ్యింది. ఇంగ్లీష్ సబ్జెక్టులో పాస్ మార్కులకు నాలుగు మార్కులు తక్కువగా రావడంతో పాస్ కాలేదు. అయితే ఈ ఏడాది కూడా కరోనా ఉధృతి కారణంగా పరీక్షలు నిర్వహించకుండా.. అందర్నీ పాస్ చేస్తున్నట్లు ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో స్వర్ణలత పదో తరగతి పాస్ అయింది.
ఇది కూడా చదవండి: ఇకపై బంగారు ఆభరణాలకు యూనిక్ ఐడీ నంబర్లు