2022లో అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు, ద్రవ్యోల్బణం పెరగడం, రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వంటి అంశాలతో ప్రైమరి మార్కెట్ నుంచి నిధుల సేకరణ కోసం జారీ చేసే పబ్లిక్ ఆఫర్‌లు అంతగా విజయం సాధించలేకపోయి. ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఇలా ఐపీఓల ద్వారా 57 వేల కోట్ల రూపాయలను కంపెనీలు సమీకరించాయి. ఈ సంవత్సరం వచ్చిన మొత్తం 57 వేల కోట్లలో 35 శాతంఎల్‌ఐసీ పబ్లిక్ ఆఫర్ ద్వారా సేకరించినవే ఉన్నాయి. ఎల్‌ఐసీ ఈ ఆఫర్ ద్వారా 20,557 కోట్లు సమీకరించింది. ఆర్ధిక మాంద్యం భయాలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పెరుగుదల వంటి అంశాలతో 2022లో ఇన్వెస్టర్లు గందరగోళం లోనే ఉన్నారు. 2023 సంవత్సరం మరింత కఠినంగా ఉండనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆర్ధిక మాంద్యం పెరుగుతుందన్న ఆందోళన ఉంది.
ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక వ్యవస్థ వృద్ధిరేటుపై దీని ప్రభావం గణనీయంగా ఉంటుందని భావిస్తున్నారు. మన దేశ ఆర్ధిక వ్యవస్థలోనూ దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది. 2023లో పబ్లిక్ ఆఫర్ ద్వారా నిధుల సమీకరణ 2022 కంటే కూడా తగ్గే సూచనలు ఉన్నాయని జరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ అభిప్రాయపడ్డారు. ఇన్వెస్టర్ల నుంచి 2022లో వచ్చిన స్పందన చాలా బలహీనంగా ఉంది. ముఖ్యంగా ఐపీఓల ధరల శ్రేణి వీరిని ఆకట్టుకోలేదని భావిస్తున్నారు. దీని ప్రభావం 2023లోనూ ఉండే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ ఏడాది చివరిలో మరో రెండు కంపెనీలు కెఫిన్ టెక్నాలజీస్, ఎలిన్ ఎలక్ట్రానిక్స్ ఐపీఓలు వచ్చే వారం మార్కెట్‌లో లిస్ట్ కానున్నాయి. ఈ రెండు సంస్థలు 1,975 కోట్లు సేకరించనున్నాయి. 2021లో 63 కంపెనీలు పబ్లిక్ ఆఫర్‌కు వచ్చాయి. ఈ కంపెనీలు 1.2 లక్షల కోట్లు సమీకరించాయి. 2020లో 15 కంపెనీలు ఐపీఓ ద్వారా 26,611 కోట్లు సేకరించాయి. 2022లో ఐపీఓల తో పాటు ఫాలోఆన్ ఆఫర్‌ను రూచీ సోయా ప్రకటించింది. దీని ద్వారా కంపెనీ 4,300 కోట్లు సమీకరించింది. ఎల్‌ఐసీ తరువాత డేలివరీ సంస్థ 5,235 కోట్లు, అదానీ విల్మర్ 3,600 కోట్లు, వేదాంత్ ఫ్యాషన్స్ 3,149 కోట్లు, గ్లోబల్ హెల్త్ 2,205 కోట్లు సమీకరించాయి. ఇందులో ఎల్‌ఐసీ, డెలివరీ సంస్థల ఐపీఓ జారీ ధర కంటే 25 శాతం తక్కువలో వాటి షేర్లు ట్రేడవుతున్నాయి. ఈ సంవత్సరం చిన్న, మధ్య తరహా సంస్థలు 1,807 కోట్లు ఐపీఓల ద్వారా సమీకరించాయి.