నానాటికీ తీవ్రమవుతున్న వాతావరణ మార్పుల దుష్ప్రభావాలు భయానకంగా ఉంటాయని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది జీవితాలను, జీవనోపాధిని ప్రభావితం చేసే అత్యంత వినాశకరమైన విపత్తులు ఎదురవుతాయని తాజా నివేదికలో పేర్కొంది. 2030 వరకు ప్రతియేటా 560 ప్రకృతి విపత్తులు ఈ భూగ్రహాన్ని చుట్టుముట్టేస్తాయి. రాబోయే సంవత్సరాల్లో భూమండలం తీవ్రంగా దెబ్బతింటుంది. ప్రస్తుత వినాశకర పోకడలు ఇలాగే కొనసాగితే పరిస్థితులు దారుణంగా ఉంటాయి. 2015లో ఏడాదికి 400 విపత్తులు ఎదురయ్యాయి. వాటిలో చాలావరకు వాతావరణానికి సంబంధించిన విపత్తులే. ముఖ్యంగా అగ్నిప్రమాదాలు, వరదలు ఉన్నాయి అని నివేదిక స్పష్టంచేసింది. ”వాతావరణ మార్పులు వాతావరణ సంబంధిత ప్రమాదాల పరిమాణం, ఫ్రీక్వెన్సీ, వ్యవధి, తీవ్రతను పెంచుతున్నాయి. ఇది విపత్తు నష్టాలు, అభివృద్ధి సాధన వైఫల్యాలకు హేతువుగా మారింది” అని శాస్త్రీయ నివేదిక పేర్కొంది. ఈ ప్రతికూల పరిస్థితులను అధిగమించకపోతే, విపత్తు పరిణామాలు మనం నిర్వహించలేని స్థితికి చేరుకుంటాయని ఐరాస ఆఫీస్ ఆఫ్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ చీఫ్ మామి మిజుటోరి స్పష్టంచేశారు.
నివేదికలోని కీలక అంశాలు..
- 1970 నుండి 2000 వరకు సగటున సంవత్సరానికి 90-100 మధ్య, స్వల్పస్థాయి విపత్తులు ఎదురయ్యాయి.
- 2001తో పోల్చితే విపరీతమైన వేడిగాలుల సంఖ్య 2030లో మూడు రెట్లు పెరుగుతుంది. తద్వారా కరువులు 30 శాతం పెరుగుతాయి.
- ప్రస్తుతం విపత్తులపై చేస్తున్న ఖర్చులో 90 శాతం అత్యవసర సహాయమే. పునర్నిర్మాణంపై కేవలం 6 శాతం, విపత్తుల నివారణకు 4 శాతమే వెచ్చిస్తున్నాం.
- 1990లో, విపత్తుల వల్ల ప్రపంచానికి సంవత్సరానికి 70 బిలియన్ డాలర్లు ఖర్చయ్యాయి. ఇప్పుడు ఈ అంచనా 170 బిలియన్ డాలర్లు దాటింది.
- ఈ విపత్తుల వల్ల అభివృద్ధి చెందుతున్న దేశాలకే ఎక్కువ నష్టదాయకం. అభివృద్ధి చెందిన దేశాలు జీడీపీలో
0.1- 0.3 శాతం నష్టపోతుంటే, అభివృద్ధి చెందుతున్న దేశాలు 1శాతం నష్టపోతున్నాయి. - ఆసియా-పసిఫిక్ ప్రాంతం అత్యధిక నష్టాన్ని చవిచూస్తోంది. ఏటా విపత్తుల కారణంగా జీడీపీలో సగటున 1.6 శాతాన్ని కోల్పోతోంది.
- బీమా విషయంలో అభివృద్ధి చెందిన దేశాలు కూడా వెనుకబడే ఉన్నాయి. 1980 నుండి విపత్తు సంబంధిత నష్టాలలో 40 శాతం మాత్రమే బీమా చేయబడింది.
- ప్రకృతి వైపరీత్యాలే కాకుండా, కోవిడ్-19, ఆర్థిక మాంద్యం, ఆహార కొరత వంటి నష్టాలపైనా ఈ నివేదిక ప్రస్తావించింది. మానవుల నిర్ణయాలు మరింత తీవ్రమైన సంఘటనలకు కారణమవుతున్నాయని పేర్కొంది.
- ప్రకృతి వైపరీత్యాలకు గురయ్యే ప్రాంతాలలో జనాభా పెరగడం వల్ల కూడా విపత్తుల ప్రభావం ఎక్కువైందని నివేదిక పేర్కొంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..