హైదరాబాద్, ఆంధ్రప్రభ: గ్రూప్-2 దరఖాస్తు ప్రక్రియకు గురువారం సాయంత్రం 5 గంటలతో ముగిసింది. గడువు ముగిసే సమయానికి మొత్తం 5,51,943 దరఖాస్తులు అందినట్లు టీఎస్పీఎస్సీ అధికారులు ప్రకటించారు. ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. మొత్తం 783 గ్రూప్-2 పోస్టులకు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. దీనికి జనవరి నెల 18వ తేదీ నుంచి ఈనెల 16వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించారు. అయితే గ్రూప్-2 పరీక్ష తేదీను మాత్రం టీఎస్పీఎస్సీ ప్రకటించలేదు.
త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది. గ్రూప్-2 పరీక్ష తేదీపైన అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే పలు నోటిఫికేషన్లు వెలువడంతో ఒకే తేదీన ఏ రెండు పరీక్షలు ఉండకూడదనే ఉద్ధేశంతో గ్రూప్-2 పరీక్ష తేదీలను ఖరారు చేసే పనిలో ఉన్నారు. దీనికనుగుణంగా పరీక్ష తేదీలను నిర్ణయిస్తున్నారు. గ్రూప్-3కి ఈనెల 23 వరకు దరఖాస్తు గడువు ఉంది. అయితే గురువారం సాయంత్రం ఏడు గంటల వరకు గ్రూప్-3కు దాదాపు 4.10 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది.
అయితే గ్రూప్-2, గ్రూప్-3కు భారీ పోటీ నెలకొంది. గ్రూప్-3కు ఇంకా గడువు ఉండంతో దరఖాస్తుల సంఖ్య భారీగా పెరగనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే గడువు ముగిసిన గ్రూప్-4కు 9.60 లక్షలు దరఖాస్తులు వచ్చిన విషయం తెలిసిందే.