Thursday, November 7, 2024

ఆదివాసి, గిరిజన తండాలకు కాళేశ్వరం జలాలు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఆసఫ్‌ జాహీ రాజుల కాలంలో సాలార్‌ జంగ్‌ సంస్కరణలో భాగంగా నిర్మించిన సాదర్‌మట్‌ ఆనకట్ట కాలం పెట్టిన పరీక్షలకు నిలిచి రాష్ట్ర ప్రభుత్వం చేసిన రీ-ఇంజనీరింగ్‌లో భాగమైంది. నిర్మల్‌ జిల్లాలోని మారుప్రాంతాలకు నీరు అందించే లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా జలాశయ విస్తరణకు ప్రభుత్వం డీపీఆర్‌ సిద్ధంచేసి పనులు ప్రారంభించింది. మే చివరినాటికి జలాశయం పనులు పూర్తి చేసి వెట్‌ రన్‌కు సిద్ధంకావాలని సాగునీటి పారుదల శాఖను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు నిధుల కేటాయింపులు చేసి పనుల్లో వేగం పెంచింది.

పోరాటాల ఖిల్లాగా పేరొందిన నిర్మల్‌లో నిమ్మరాజులు, ఉట్నార్‌ గోండురాజుల కాలంలో నిర్మించిన జలాశయాలు నేటికి సాగుకు యోగ్యంగా ఉన్నా గత పాలకుల నిర్లక్ష్యంతో పూడికతీతకు నోచుకోలేదు. 1857 సిపాయిల తిరుగుబాటుకు నిలయంగా నిల్చిన నిర్మల్‌కు దేశ చరిత్రలో ఓ పేజీ ఉన్నా సాగునీటి నిర్లక్ష్యానికి గురై ఇప్పటికీ నిర్మల్‌ జిల్లా ఆదివాసీలు పోడు వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఈనేపథ్యాన్ని పరిశీలించిన సీఎం కేసీఆర్‌ నిర్మల్‌ను కాళేశ్వరం జలాలతో సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో సాదర్‌ మట్‌ బ్యారేజ్‌ విస్తరణకు ప్రాధాన్యత ఇచ్చారు. ఈ ప్రాజెక్టుతో నిర్మల్‌ గిరిజన, ఆదివాసీ ప్రాంతాలకు పుష్కలమైన సాగునీరు అందే అవకాశాలు మెరుగయ్యాయి.

- Advertisement -

ప్రస్తుతం ఉన్న ఆనకట్టను జలాశయాన్ని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.516.233 కోట్ల పరిపాలనాపరమైన అనుమతులు ఇచ్చి నిధులు కేటాయిందింది. గత ఆర్థిక సంవత్సరంలో భూసేకరణ, డీపీఆర్‌, ఇంజనీరింగ్‌ పనులకు రూ.328 కోట్లు ఖర్చుచేసింది, ఇందులో రూ.40 కోట్లు వ్యాట్‌, జీఎస్‌టీ, లేబర్‌ సెస్‌లకు కేటాయించినప్పటికీ కేంద్రం నుంచి ఒక్కరూపాయి కూడా ప్రాజెక్టు నిర్మాణానికి ఆర్థిక ససహాయం అందలేదని అధికారులు చెప్పారు. ప్రాజెక్టును 31 మే 2023 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం అదేశించినట్లు అధికారులు తెలిపారు.

నిర్మల్‌ జిల్లా మామడ మండలం పోంకల్‌ గ్రామ సమీపాన ఉన్న శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుపై ఈ నిర్మాణాన్ని ప్రభుత్వం తలపెట్టింది. ఈ ప్రాజెక్టుకు అవసరమయ్యే 1,176 ఎకరాల కోసం జిల్లా కలెక్టర్‌కు ప్రభుత్వం డీపీఆర్‌ సమర్పించింది. అయితే ఇప్పటికే 1,035 ఎకరాల భూసేకరణ జరిగింది. మరో 141 ఎకరాల సేకరణకు రూ.11కోట్లు ప్రభుత్వం కేటాయించింది. సాదర్‌ మట్‌ బ్యారేజ్‌ నీరు గంగనాల ప్రాజెక్టు ఎత్తిపోసి 1896 ఎకరాల మేరకు ఆయకట్టు స్థిరీకరించి 3 వేల ఎకరాల అదనపు ఆయకట్టును కూడా ఏర్పాటుచేసే అవకాశాలున్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో జగిత్యాల, నిర్మల్‌ ప్రాంతాల్లో మొత్తంగా 8,744 ఎకరాల విస్తీర్ణంగల ఆయకట్టును స్థిరీకరించి 9,272 ఎకరాల నూతన ఆయకట్టు ఏర్పాటుకానుంది. ఈ ప్రాజెక్టు సామర్థ్యం 4టీఎంసీలు ఉన్నప్పటికీ 1.58 టీఎంసీ నీటిని వినియోగించి సాగుభూములకు నీరు అందించనున్నారు.

నిర్దేషిత గడువులోగా పనులు పూర్తి..

గత ఉమ్మడి ఏపీ ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన ప్రాజెక్టులను సీఎం కేసీఆర్‌ రీడిజైన్‌ చేసి నిర్మాణాలు చేపట్టారని నీటి పారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ సముద్రాల వేణుగోపాలచారి చెప్పారు. అనేక సంవత్సరాల నుంచి సాదర్‌మట్‌ ఆనకట్టను విస్తరించి రిజర్వాయర్‌గా తీర్చిదిద్దాలని ఉన్న ప్రజల డిమాండ్‌ను సీఎం కేసీఆర్‌ గౌరవించి ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచారని చెప్పారు. సదర్‌మాట్‌ బ్యారెజ్‌తో అడవి ప్రాంతాల్లోని గిరిజన తండాలకు కాళేశ్వరం జలాలు అందనున్నాయని చెప్పారు. మామడ లాంటి అడవిప్రాంతాల్లో వ్యవసాయ యెగ్యమైన సాగుభూములకు నీరు అందనున్నాయి. నీటిపారుదల శాఖ ఇంజనీర్లతో త్వరలో సమావేశం ఏర్పాటు చేసి పనుల పురోగతిని సమీక్షించనున్నట్లు చెప్పారు. సాదర్‌మట్‌ బ్యారేజ్‌తోపాటు అనేక చెక్‌ డ్యాంల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. సాదర్‌మట్‌ బ్యారేజ్‌ నిర్మాణానికి అధిక నిధులు కేటాయించినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మే 2023 చివరినాటికి వెట్‌ రన్‌కు సిద్ధం చేసి బీడుభూముల్లో సాగునీటిని ప్రవహింపచేయనున్నట్లు ఆయన చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement