Saturday, November 23, 2024

Where is the Money | జాడలేని 88 వేల కోట్ల విలువైన 500 నోట్లు

ఆర్బీఐ వద్ద 88,032.5 కోట్ల విలువైన 500 రూపాయల నోట్ల వివరాలు లేవు. సమాచార హక్కు చట్టం ప్రకారం మనోరంజన్‌రాయ్‌ అనే సామాజిక కార్యకర్త పెట్టుకున్న దరఖాస్తుకు ఆర్బీఐ ఇచ్చిన సమాధానంలో ఈ విషయం వెల్లడైంది. పాతనోట్లను రద్దు చేసిన కొత్త 500 నోట్లను తీసుకు వచ్చిన సమయంలో దేశంలోని 3 ముద్రణాలయాల నుంచి 8,810.65 మిలియన్ల 500 రూపాయల నోట్లను ముద్రించారు. అందులో కేవలం 7,260 మిలియన్ల నోట్లు మాత్రమే ఆర్బీఐకి చేరినట్లు ఆర్‌టీఐ నివేదిక తెలిపింది. మిగతా 1,760.65 మిలియన్ల నోట్లకు సంబంధించి ఎలాంటి సమాచారం ఆర్బీఐ వద్ద లేదు.

దేశంలో మూడు చోట్ల కరెన్సీ నోట్లను ముద్రిస్తారు. బెంగళూర్‌లోని రిజర్వ్‌ బ్యాంక్‌ నోట్‌ ముద్రణ్‌ లిమిటెడ్‌, నాశిక్‌లోని కరెన్సీ ప్రెస్‌, మధ్యప్రదేశ్‌ దేవస్‌లోని బ్యాంక్‌ నోట్‌ ప్రెస్‌లో దేశానికి అవసరమైన కరెన్సీ నోట్లను ముద్రిస్తారు. 2016-17 మధ్య కాలంలో 1,662 మిలియన్ల 500 రూపాయల నోట్లను ముద్రించినట్లు నాశిక్‌ మింట్‌ వెల్లడించింది. బెంగళూర్‌ ప్రెస్‌లో 5,195.65 మిలియన్లు, దేవస్‌లో 1,953 మిలియన్ల నోట్లను ముంద్రించినట్లు ఆర్‌టీఐ ద్వారా వెల్లడైంది. ఆర్బీఐ మాత్రం కేలం 7260 మిలియన్ల నోట్లు మాత్రమే అందినట్లు తెలిపింది.

- Advertisement -

మరో ఆర్టీఐ కార్యకర్త దరఖాస్తు ద్వారా పొందిన వివరాల ప్రకారం..

ఏప్రిల్‌ 2015- డిసెంబర్‌ 2016 మధ్య కాలంలో నాశిక్‌ ముద్రణాలయంలో375.45 మిలియన్ల కొత్త 500 నోట్లు ముంద్రించారు. ఆర్బీఐ మాత్రం కేవలం 345 మిలియన్ల నోట్లు మాత్రమే వచ్చినట్లు చెబుతోంది. కనిపించకుండా పోయిన మొత్తం 1760.65 మిలియన్ల నోట్లలో 210 మిలియన్ల నోట్లు ఏప్రిల్‌ 2015 నుంచి మార్చి 2016 మధ్యకాలంలో ముద్రించినట్లు తేలింది. నవంబర్‌ 2016లో కేంద్రం నోట్ల రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీని తరువాత కొత్త నోట్లను తీసుకు వచ్చారు. ఆర్‌టీఐ వివరాల ప్రకారం 2015లోనే ముద్రణాలయాల్లో కొత్త నోట్లను ముద్రించినట్లు తెలుస్తోంది.

88,032.5 కోట్ల విలువైన నోట్లు కనిపించకుండా పోయిన విషయం వాస్తవమే అయితే, దీనిపై స్పష్టత రావాల్సి ఉంటుంది. ఈ నోట్లు ఎలా మిస్‌ అయ్యాయన్న విషయం తెలియాల్సి ఉంది. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో గుర్తించిన 500 నకిలీ నోట్ల సంఖ్య గతంతో పోల్చితే భారీగా పెరిగి 14.4 శాతానికి చేరాయని ఆర్బీఐ ఇటీవల విడుదల చేసిన వార్షిక నివేదికలో పేర్కొంది. మొత్తం 91,110 నకిలీ నోట్లను గుర్తించినట్లు తెలిపింది. 2000 నకిలీ నోట్ల సంఖ్య 9,806కు చేరినట్లు తెలిపింది. ప్రస్తుతం ఆర్బీఐ 2000 నోట్ల చెలామణిని నిలిపివేసింది. ఈ నోట్లను సెప్టెంబర్‌ 30లోగా మార్చుకోవాలని ఆర్బీఐ కోరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement