Friday, November 22, 2024

టీఎస్‌ ఆర్టీసీకి మరో 500 ఎలక్ట్రిక్‌ బస్సులు.. శివారు ప్రాంతాల్లోని విద్యా సంస్థలకు అధిక ప్రాధాన్యం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : టీఎస్‌ ఆర్టీసీ మరో 500 ఎలక్ట్రిక్‌ వాహనాలను సమకూర్చుకోనుంది. ఈ విద్యా సంవత్సరం ముగిసే నాటికి ఈ బస్సులు సంస్థకు అందుబాటులోకి రానున్నాయి. కాగా, ఈ బస్సులను హైదరాబాద్‌ శివారు ప్రాంతాలకు వెళ్లే విద్యార్థుల సౌకర్యార్థం వినియోగించనున్నారు. గత పదేళ్లలో హైదరాబాద్‌ శివార్లలో పదుల సంఖ్యలో ఇంజనీరింగ్‌, డిగ్రీ, ఫ్యాషన్‌, ఇంటీరియర్‌ డిజైనింగ్‌ కళాశాలలు ఏర్పడ్డాయి. ఈ కళాశాలల్లో వేలాది మంది విద్యార్థులు పలు కోర్సులు అభ్యసిస్తున్నారు. అయితే, ఈ కళాశాలలు ఎక్కువగా మారుమూల ప్రాంతాలలో ఉండటంతో ఆర్టీసీ బస్సులు ఎక్కువగా నడపటం లేదు. దీంతో విద్యార్థులు కార్లు, టూ వీలర్లు వంటి తమ సొంత వాహనాలపైనే ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ నగరం నుంచి శివార్లలోని విద్యా సంస్థలకు వెళ్లే విద్యార్థుల కోసం 100 అదనపు ట్రిప్పులను ఏర్పాటు చేయాలని టీఎస్‌ ఆర్టీసీ నిర్ణయించింది. ఈమేరకు గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ అధికారులతో సంస్థ ఎండి సజ్జన్నార్‌ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

శివారు ప్రాంతాలలో విద్యార్థుల రద్దీ ఏ విధంగా ఉంది ? ఏ ప్రాంతానికి ఎన్ని బస్సులు నడుస్తున్నాయి ? ఇంకా ఎన్ని బస్సులు అవసరం అనే అంశాలపై వివరాలు సేకరించారు. కాగా, ఇప్పటికే ఆర్టీసీ శివారు ప్రాంతాలను 12 కారిడార్‌లుగా విభజించింది. ఇందులో 44 వేల మంది విద్యార్థులు ప్రతీ రోజూ రాకపోకలు కొనసాగిస్తున్న ఇబ్రహీంపట్నం క్లస్టర్‌లో 350 బస్సులను నడిపిస్తున్నారు. అయినప్పటికీ విద్యార్థులు ఫుట్‌బోర్డ్‌పై ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. దీంతో విద్యార్థులు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు సైతం చోటు చేసుకుంటున్నాయి. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లే ఈ ఘటనలకు కారణమంటూ తల్లిదండ్రుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

- Advertisement -

ఈ నేపథ్యంలో ఆ కారిడార్‌లో అదనంగా మరో 30 ట్రిప్పులను నడపాలని టీఎస్‌ ఆర్టీసీ నిర్ణయించింది. మిగతా 70 ట్రిప్పులను ఘట్‌కేసర్‌, మేడ్చల్‌, కీసర తదితర ప్రాంతాలకు నడుపనున్నారు. ఈ విద్యా సంవత్సరం ముగిసే నాటికి టీఎస్‌ ఆర్టీసీకి అందుబాటులోకి రానున్న 500 ఎలక్ట్రిక్‌ బస్సుల్లో నాలుగో వంతు బస్సులను శివారు విద్యా సంస్థల వరకు ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించిన ప్రణాళికలను ఇప్పటికే సిద్ధం చేసిన టీఎస్‌ ఆర్టీసీ తొలి దశలో 25 ఆ తరువాత మిగతా బస్సులను అందుబాటులోకి తీసుకు రానుంది. అలాగే, నగరంలో ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా బస్సులు నడుపుతున్న విధంగానే విద్యార్థినుల కోసం టీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు నడుపనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement