హైదరాబాద్, ఆంధ్రప్రభ : వచ్చే ఆర్థిక సంవత్సరానికి(2023-24)గాను పురపాలక శాఖకు బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.11 వేల372 కోట్లు కేటాయించింది. ఇది గత సంవత్సరం కంటే సుమారు రూ.1000 కోట్లు అదనం. వీటిలో నిర్వహణ ఖర్చుకు రూ. 3792 కోట్లు కేటాయించగా ప్రగతి పద్దు కింద రూ. 7176 కోట్లు కేటాయించారు. హైదరాబాద్‌లో మెట్రో రైలు విస్తరణ కోసం ప్రభుత్వం 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.1500 కోట్లు కేటాయించింది. ఇందులో కొత్తగా నిర్మాణం చేపడుతున్న ఎయిర్‌పోర్టుకు ఎక్స్‌ప్రెస్ మెట్రో కోసం రూ.500 కోట్లు, పాతబస్తీ మెట్రో కోసం రూ.500 కోట్లు కేటాయించారు.
రాజధాని నగరంలో మౌలిక వసుతలను మెరుగు పరచడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యక్రమాలను చేపట్టింది. రోజురోజుకు పెరుగుతున్న విమాన ప్రయాణికుల రవాణా సౌకర్యం కోసం హైదరాబాద్ నలుమూలల నుంచి విమానాశ్రయానికి తొందరగా చేరుకోవడానికి మెట్రోరైలును ఎయిర్‌పోర్టుకు అనుసంధానం చేస్తూ ఎయిర్‌పోర్టు మెట్రోకు ప్రభుత్వం రూపకల్పన చేసింది. ఈ మెట్రో మార్గం రాయదుర్గం మెట్రోస్టేషన్ నుంచి విమానాశ్రయం వరకు 31 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపడుతోంది. ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సొంత ఖర్చుతో రూ.6250 కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధ పడిన విషయం తెలిసిందే.