హైదరాబాద్, ఆంధ్రప్రభ : బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించేందుకు నీటి పారుదల శాఖ నివేదికలను సిద్ధం చేస్తోంది. న్యాయనిపుణుల సలహాలు తీసుకుంటుంది. ఈ మేరకు రాష్ట్ర నీటి పారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ రావు శుక్రవారం సీనియర్ ఇంజనీర్లతో సమావేశమై కృష్ణా జలాల్లో న్యాయమైన వాటకోసం ట్రిబ్యునల్ ముందు వినిపించే వాదనలను పరిశీలించారు.
15 నవంబర్ లోగా ఏపీ ప్రభుత్వం ట్రిబ్యునల్ కు కేంద్ర మార్గదర్శకాలపై స్పష్టత ఇచ్చినా, ఇవ్వకున్నా ట్రిబ్యునల్ ముందు కృష్ణా జలాల్లో న్యాయమైన వాటాకోసం వాదనలు వినిపించేందుకు సిద్ధమైంది. ప్రధానంగా ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులతో తెలంగాణకు జరుగుతున్న నష్టాన్ని ట్రిబ్యునల్ దృష్టికి తీసుకువచ్చేందుకు ప్రాజెక్టుల వారిగా నివేదికలను రూపొందిస్తున్నట్లు సమాచారం.
అలాగే కృష్ణా నది జలాల వాటాలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని నిరూపిస్తూ లభ్యత ఉన్నజలాల్లోనూ 50 శాతం, వరదజలాల్లో 75 శాతం తెలంగాణకు చెందాలని ట్రిబ్యునల్ కు విజ్ఞప్తి చేయనుంది. శ్రీశైలం నుంచి ఏపీ సర్కార్ నీటిని తోడితే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు నీటి కొరత పై ట్రిబ్యునల్ ముందు తెలంగాణ వాదించేందుకు నివేదికలను సిద్ధం చేస్తోంది.
కృష్ణా నది జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీలు కేటాయించడంతో సాగునీరు, తాగునీటి అవసరాలకు భవిష్యత్ లో ఆందోళన కరమైన పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉందని ఇప్పటికే కేఆర్‌ఎంబీ, సీడబ్ల్యూసీ కి ఫిర్యాదులు చేసినా ఫలితం లేకపోవడంతో ట్రిబ్యునల్ దృష్టికి ఈ అంశాన్ని తీసుకువచ్చేందుకు ప్రత్నిస్తోంది.
అలాగే పట్టిసీమ నుంచి దిగువకు ప్రవహించే నీటి కేటాయింపుల్లో తెలంగాణకు రావల్సిన 45 టీఎంసీల పై ట్రిబ్యునల్ ముందు తెలంగాణ పట్టుబట్టనుంది. కొల్లాపూర్ నియోజకవర్గం కోతి గుండు నుంచి నార్లాపూర్ రిజర్వాయర్ కు నీటిని తోడేందుకు పూర్తి స్థాయి అవకాశాలున్నప్పటికీ శ్రీశైలం నుంచి ఏపీ భారీగా నీటిని తోడటంతో లభ్యత తగ్గుతోందని తెలంగాణ విచారం వ్యక్తం చేస్తుంది.
నార్లాపూర్ రిజర్వాయర్ నుంచే మిగతా రిజర్వాయర్లకు నీరు అందించాలంటే కృష్ణా బ్యాక్ వాటర్ లభ్యతకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ మేరకు ఏపీ దిగువన నిర్మిస్తున్న ప్రాజెక్టులను నిలిపి వేయాలని ఇప్పటికే కేఆర్‌ఎంబీ దృష్టికి తీసుకువెళ్లి న ఫలితం లేకపోవడంతో ట్రిబ్యునల్ ముందు వాదనలుకుతెలంగాణ సిద్ధమైంది.