Sunday, November 24, 2024

అదానీ ఫౌండేష‌న్ పేరుతో రూ.50 కోట్ల ద‌గా..

అన్నమయ్య:, ప్రభన్యూస్‌: అసలే నిరుద్యోగం. ఆపై మోసం. భవిష్యత్‌పై ఆశచూపి.. ఊహల్లో బాటలేసి.. ప్రభుత్వ కొలువులను ఖాయం చేస్తామని చెప్పి.. నిరుద్యోగులను నిలువు దోపిడీ చేసిన ఉదంతం అన్నమయ్య జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఇటీవలనే జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి వెళ్లిన కొందరు తమ పేర్లు చెప్పడానికి నిరాకరిస్తూ బయట తమ గోడు వెల్లబోసుకున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆరా తీస్తే టీచర్ల రిక్రూట్‌మెంటు పేరుతో ఒక ముఠా నిరుద్యోగులను నిలువునా దోపిడీ చేసినట్టు స్పష్టమౌతోంది. నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తామని నమ్మించడానికి, ఉద్యోగాలపై నమ్మకం కలిగించడానికి శిక్షణ ఇవ్వడంతోపాటు సర్టిఫికేట్లను కూడా ఇప్పించారు. అంతేకాదు.. నిరుద్యోగులు నమ్మి ఉద్యోగాలకోసం డిమాండ్‌ చేసే డబ్బు చెల్లించడానికి ఓ పత్రికలో టీచర్ల ఔట్‌సోర్సింగ్‌ రిక్రూట్‌మెంటు పేరుతో ప్రకటన ఇప్పించారు. ఆదానీ ఫౌండేషన్‌ పేరుతో పాఠశాల్లలో పర్మినెంట్‌ టీచర్ల పేరుతో సాగే ఈ దందాకు చాలామంది నిరుద్యోగులు ఆకర్షితులయ్యారు. ఒక్కొక్కరు తమ ఉద్యోగం కోసం రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకూ వసూలు చేశారు. ఈ ప్రకారం ప్రతి జిల్లాలోనూ 100 మందికి పైగానే ఉండగా రాష్ట్రంలో సుమారు 2600 మందికి పైగా బాధితులన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.

ఔట్‌సోర్సింగ్‌ టీచర్స్‌ రిక్రూట్‌మెంటు పేరుతో ప్రకటనలు
ప్రభుత్వ ఎయిడెడ్‌ పాఠశాలల్లో టీచర్ల రిక్రూట్‌మెంటు పేరుతో ఒక ప్రకటన వెలువడింది. దాని ప్రకారం 2023 జనవరి 7వ తేదీలోగా అటానమస్‌ రిక్రూట్‌మెంట్‌ బాడీ ఆప్‌ టేకింగ్‌ శిక్ష విధాన్‌ కౌన్సిల్‌, న్యూ ఢిల్లిd వారికి పంపించాలని అందులో సారాంశం. ఆన్‌లైన్‌ ద్వారా ఫిబ్రవరి 25వ తేదీలోగా పంపాలని తెలిపారు. రిజిష్ట్రేషన్‌ మరియు ప్రాసెసింగ్‌ ఫీజు రూ. 500గా నిర్ణయించారు. ఆ ప్రకటనలో యోగా టీచర్లు 119 (జీతం రూ. 32,000/-) , ఆర్ట్స్‌ టీచర్లు119 (జీతం రూ. 32,000/-), మ్యూజిక్‌ టీచర్లు 119 (జీతం రూ. 32,000/-), హిందీ టీచర్లు 119 (జీతం రూ. 35,000/-), తెలుగు టీచర్లు 119 (జీతం రూ. 35,000/-), ఇంగ్లీషు టీచర్లు 119 (జీతం రూ. 35,000/-), మ్యాథ్స్‌ టీచర్లు 119 (జీతం రూ. 35,000/-), జనరల్‌ సైన్సు టీచర్లు 119 (జీతం రూ. 35,000/-), సోషియల్‌ టీచర్లు 119 (జీతం రూ. 35,000/-), లైబ్రేరియన్లు 119 (జీతం రూ. 30,000/-), టెక్నికల్‌ అసిస్టెంట్లు 119 (జీతం రూ. 30,000/-), ఆఫీసు సబార్డినేట్స్‌ 119 (జీతం రూ. 20,000/-)గా ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఆ ప్రకటనను చూసిన కొందరు అర్హత కలిగిన నిరుద్యోగులు దరఖాస్తులు చేసుకున్నారు. ఆ ప్రకటన ఆధారంగా కొందరు నిరుద్యోగులను సొమ్ము చేసుకోడానికి పన్నిన పన్నాగం ఫలించింది. ఆ ప్రకారమే వారు విద్యాంజలిని తమకు అనుకూలంగా మార్చుకున్నారనే విమర్శలు న్నాయి.

కామధేనువుగా మారిన విద్యాంజలి..
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని విద్యాంజలి కార్యక్రమాన్ని కొందరు కేటుగాళ్లు కామధేనువుగా మార్చుకున్నట్టు విమర్శలున్నాయి. ఎక్కడో తెలంగాణా రాష్ట్రంలోని హైదరా బాదులో కూర్చొన్న ఓ వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌లో అన్ని జిల్లాల్లోనూ ఏజెంట్లను నియమించుకొని వేసిన స్కెచ్‌ మంచి ఫలితాలనే ఇచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఒక్కో ఉద్యోగం ఖరీదు రూ. 2 లక్షలు. జిల్లాకు కనీసం 100 ఉద్యోగాలు. 26 జిల్లాల్లో సరాసరిన 2600 పోస్టులు. ఈ లెక్కన మొత్తం రూ. 52 కోట్లు. విద్యాంజలి కార్యక్రమం ఆధారంగా ఆదానీ పౌండేషన్‌ పేరుతో జరుగుతున్న ఈ దందా ప్రధాన చర్చగా మారింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే విద్యాంజలి పథకం పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా సేవ చేసేవారికి మంచి అవకాశం. రిటైర్డ్‌ ఉపాధ్యాయులు, లేక ఇతర ప్రతిభావంతులు పాఠశాలల్లో తమకు తెలిసిన విద్యను ఉచితంగా అందించే పథకమే విద్యాంజలి. ఈ పథకంతో కోట్ల రూపాయలు దండుకునే పథకాన్ని రచించిన ఒక వ్యక్తి దేశ వ్యాప్తంగా దందాను ప్రారంభించినట్టు విమర్శలు న్నాయి. ఏదైనా ఒక పరిశ్రమ గానీ, ఒక సంస్థగానీ తన వార్షికాదా యంలో కొంత శాతాన్ని సామాజికా భివృద్ధికి ఖర్చు చేయాలనే నిబంధన ఆ సంస్థలు లేక పరిశ్రమల ఏర్పాటు నిబంధనలలో ఉంటుంది. ఈ ప్రకారమే దేశంలోని పెద్దపెద్ద పరిశ్రమలు తమ ఆదాయంలో కొంత శాతాన్ని సమాజాభివృద్ధికోసం పలు రకాలుగా ఖర్చు చేస్తున్నా యి. అందులో భాగంగానే ఆదానీ ఫౌండేషన్‌ పేరుతో కూడా కొంత మొత్తాన్ని ఖర్చు చేస్తుండవచ్చు. ఆ చిన్న ట్రిక్కును ఆధారంగా చేసుకొన్న కొందరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల్లో యోగా టీచర్లను నియమించి విద్యార్థులకు మానసిక వికాసాన్ని పెంచాలన్న ప్రతిపాదనను తెచ్చారు. నేరుగా పాఠశాలలకు వెళ్లి అడిగితే అక్కడి ప్రధానోపాధ్యయుడికి వారిని నియమించుకునే అధికారం లేదు కాబట్టి.. జిల్లా విద్యాశాఖాధికారివద్ద అనుమతులు తీసుకుంటున్నారు. విద్యాంజలి పథకంలో ఎటువంటి జీతభత్యాలు లేకుండా ఉచితంగా సేవ చేసేవారికే అనుమతులు వస్తాయని విద్యాశాఖాధికారులు స్పష్టంగా చెబుతున్నారు. ఇటీవల అన్నమయ్య జిల్లా విద్యాశాఖాధికారి రాఘవరెడ్డి వద్దకు వచ్చిన కొందరికి ఆయన కూడా ఇవే విషయాలను వివరించినట్టు సమాచారం.
కానీ.. ఆ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే ఏజెంట్లు మాత్రం యోగా టీచర్లకు తామే నెలనెలా జీతాలిస్తామని హామీ ఇచ్చి మరీ చేర్చుకుంటున్నారు. అదెలా అని ఎవరైనా అడిగితే.. ఆదానీ ఫౌండేషన్స్‌.. ఇలా పలు సంస్థల నుండి సామాజిక అభివృద్ధికి కేటాయించే నిధులను తీసుకువచ్చి జీతాలిస్తామని, కొంతకాలం తరువాత అవి ప్రభుత్వ ఉద్యోగాలుగా మారిపోతాయని బుకాయిస్తున్నారు. దీనిని నమ్మిన అమాయక నిరుద్యోగులు తమకు యోగాలో అనుభవం లేదంటున్నా అటువంటి వారికి శిక్షణ ఇప్పిస్తామని చెబుతున్నారు. ఇటీవల నెల్లూరులో జరిగిన శిక్షణ పేరుతో ఒక్కొక్కరినుంచి రూ. 8వేలు వసూలు చేసి ఒక సర్టిఫికేట్‌ను కూడా అందజేసినట్టు విమర్శలున్నాయి. ఆ సర్టిఫికేట్‌ ఆధారంగానే పాఠశాలల్లో యోగా బోధకులుగా నియమించే ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారికంగా ఎటువంటి జీత భత్యాలూ లేకుండా పనిచేయాల్సిన విద్యాంజలి పథకంలో నిరుద్యోగులు ఒక్కొక్కరు రూ. 2 నుంచి రూ. 5 లక్షలల వరకూ లంచాలుగా సమర్పించుకొని అసలు విషయం తెలియడంతో లబోదిబోమంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement