Monday, November 25, 2024

మిల్లర్ల తరుగు దందా

  • క్వింటాలుకు 5 నుంచి 10 కిలోల ధాన్యం దోపిడీ
  • రైతులు అంగీకరిస్తే ఒకే.. లేదంటే కొర్రీలు
  • రైతుల అవసరాన్ని సొమ్ముచేసుకుంటున్న మిల్లర్లు
  • అరిగోస పడుతున్న అన్నదాతలు
  • కమిషనర్‌, కలెక్టర్‌ హెచ్చరికలు బేఖాతర్‌
  • సివిల్‌ సప్లయ్‌ అధికారుల కనుసన్నల్లోనే దోపిడీ జరుగుతుందనే విమర్శ

రైస్‌ మిల్లర్ల తరుగుదందా రైతులను గుబులు పుట్టిస్తోంది. పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు అమ్మకానికి తీసుకెళితే కొనుగోళ్లలో ఆలస్యం అన్నదాతను కునుకు లేకుండా చేస్తోంది. గత కొన్ని రోజులుగా అకాల వర్షాలతో తడిసిన ధాన్యం ఆరబెట్టేందుకు నానా అవస్థలు పడ్డారు. కొనుగోలు కేంద్రాల వద్ద కుప్పలపై కప్పేందుకు కవర్లను అద్దెకు తీసుకువచ్చి రోజుల తరబడి రైతులు కొనుగోళ్లకు ఎదురుచూడాల్సిన దుస్థితిని ఎదుర్కొంటు-న్నారు. దీనికి తోడు ధాన్యం కేటాయింపులకు సంబంధించి పూర్తిస్థాయిలో మిల్లుల టాగింగ్‌ పూర్తి కాకపోవడంతో జిల్లాలో కొనుగోళ్ల ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఇన్ని ఇబ్బందులను ఎదుర్కొంటు-న్న రైతులను మిల్లర్ల తరుగు గుబులు పుట్టిస్తోంది. క్వింటాలుకు 5 నుంచి 10 కిలోల తరుగు తీసేందుకు అంగీకరిస్తేనే మిల్లుల్లో ధాన్యాన్ని దించుకుంటామని మిల్లర్లు తెగేసి చెబుతుండడంతో రైతులు అవాక్కవుతున్నారు. విధి లేని పరిస్థితుల్లో కొందరు తరుగుకు అంగీకరిస్తుంటే.. మరి కొందరు ప్రైవేట్‌ వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. సివిల్‌ సప్లయ్‌ కమిషనర్‌, జిల్లా కలెక్టర్‌ల హెచ్చరికలను మిల్లర్లు బేఖాతర్‌ చేస్తున్నారు. సివిల్‌ సప్లయ్‌ శాఖ అధికారుల కనుసన్నల్లోనే మిల్లర్లు దోపిడీకి పాల్పడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
– మెదక్‌ ప్రతినిధి, ప్రభ న్యూస్‌

ఆరుగాలం పాటు కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్మడానికి కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్తే కొనుగోళ్లలో ఆలస్యం అన్నదాతను కునుకులేకుండా చేస్తోంది. ఇటీ-వల కురిసిన అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని అరబెట్టేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. మెదక్‌ జిల్లాలో ఈ యాసంగి 411 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా 407 కేంద్రాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు- చేసి సుమారు 4.5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా నిర్ణయించారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభం అయినప్పటి నుంచి 25,880 మంది రైతుల వద్ద 1,09,525.250 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 1,06,988 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రైస్‌ మిల్లర్లకు అప్పగించారు. ఇంకా జిల్లా వ్యాప్తంగా సుమారు 2 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం రావాల్సి ఉంది. వర్షాల కారణంగా ధాన్యం కొనుగోలు నత్తనడకన సాగుతున్నాయి. సేకరించిన ధాన్యం తరలింపునకు సంబంధించి పూర్తిస్థాయిలో మిల్లుల టాగింగ్‌ పూర్తి కాకపోవడంతో తరలింపు ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. అక్కడక్కడ కొనుగోలు కేంద్రాల వద్ద కొనుగోలు జరిగిన ధాన్యాన్ని మిల్లులకు తీసుకువెళ్లే క్రమంలో జరుగుతున్న తరుగుదందా రైతులను నష్టానికి గురిచేస్తోంది. క్వింటాలుకు 5 నుంచి 10 కిలోల తరుగుతో అదనపు ధాన్యం ఇవ్వనిదే మిల్లర్లు అన్‌లోడ్‌ చేసుకోవడం లేదు. కేంద్రాల్లో 40 కిలోల బస్తా తూకం జరుగుతుంది. సంచి బరువు 650 గ్రాములు కాగా, మొత్తంగా 40.650 కిలోల ధాన్యం తూకం వేయాల్సి ఉంటు-ంది. కానీ అందుకు భిన్నంగా జరుగుతోంది. 40 కిలోల బస్తాలో 42కిలోల బరువుతో ధాన్యాన్ని తూకం వేస్తున్నారు. తరుగుతో అదనపు ధాన్యం రానిదే మిల్లుల్లో అన్‌లోడ్‌ చేయడం లేదు.

- Advertisement -

అంగీకరిస్తే ఒకలా.. లేదంటే కొర్రీలే..
తరుగుతో అదనపు ధాన్యాన్ని ఇచ్చేందుకు అంగీకరించకపోతే తేమశాతం, తాలు, తప్ప, మిల్లులో ధాన్యం నిల్వలకు చోటు- లేదని సాకు చూపుతో సవాలక్ష కొర్రీలు పెడుతున్నారు. తరుగుకు అంగీకరిస్తేనే మిల్లులో దించుకుంటు- రైతుల కష్టాన్ని దోచుకుంటు-న్నారు. జిల్లాలోని ఆయా రైస్‌ మిల్లర్లలో తాలు, తప్ప సాకు చూపి క్వింటాల్‌ ధాన్యానికి 5 నుంచి 10 కిలోల తరుగు తీసుకుంటు-న్నట్లు- రైతులు ఆరోపిస్తున్నారు. గత్యంతరం లేని పరిస్థితిల్లో రైతులు మిల్లర్ల షరతులకు ఒప్పుకొని అన్‌లోడ్‌ చేయించుకున్నారు. కొన్ని చోట్ల కొనుగోలు కేంద్రాలు వద్దనే కేంద్రాల నిర్వాహకులే తరుగు తీసి మిల్లులకు పంపిస్తుండగా మరి కొన్ని చోట్ల కేంద్రాల నుంచి లారీల్లో ధాన్యం బస్తాలు మిల్లులకు వెళ్లిన తర్వాత తరుగు తప్పదని చెబుతుండటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో రైతులు అందుకు ఒప్పు కుంటు-న్నారు. తాము చెప్పిన తరుగు ఇస్తే ఒకలా. లేదంటే మరోలా ప్రవర్తిస్తూ మిల్లర్లు రైతులకు చుక్కలు చూపిస్తున్నారు. తరుగు పేరిట మిల్లర్లు చేస్తున్న ధాన్యం దోపిడీని అరికట్టేందుకు సంబంధిత ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రైతులు అభిప్రాయపడుతున్నారు.

కమిషనర్‌, కలెక్టర్‌ హెచ్చరికలు బేఖాతర్‌
సివిల్‌ సప్లయ్‌ కమిషనర్‌, జిల్లా కలెక్టర్‌ల హెచ్చరికలు మిల్లర్లు బేఖాతర్‌ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిత్యం జిల్లా కలెక్టర్‌ కొనుగోలు కేంద్రాలు తనిఖీలు చేస్తున్నప్పటికీ మిల్లర్లలో మాత్రం మార్పు రావడం లేదు. రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని మిల్లర్లు అందినకాడికి దండుకుంటు-న్నారు. మిల్లర్ల తరుగు దందా సివిల్‌ సప్లయ్‌ అధికారుల కనుసన్నల్లోనే జరుగుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎండకు ఎండి వానకు తడిసి కష్టపడి పంట పండిస్తే మిల్లర్లు మాత్రం గద్దల్లా దోచుకుంటు-న్నారు. జిల్లా కలెక్టర్‌ ప్రత్యేక చొరవ తీసుకొని విచారణ చేపడితే మిల్లర్ల బండారం బట్టబయలు అవుతుందని ప్రజా సంఘాల నేతలు కోరుతున్నారు. మిల్లర్లను పర్యవేక్షించాల్సిన సివిల్‌ సప్లయ్‌ అధికారులు వారికే కొమ్ముకాయడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement