Saturday, November 23, 2024

మావోయిస్టు ప్రాంతాల్లో 4జీ టవర్లు, ఎరువులపై సబ్సిడీ కొనసాగింపు.. కేంద్ర మంత్రివర్గ నిర్ణయాలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశంలో వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవల వేగాన్ని పెంచడం కోసం 4జీ టవర్లను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్‌, ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీలు పలు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపాయి. దేశవ్యాప్తంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే ఉన్న 2జీ టవర్లను 4జీ టవర్లుగా అప్‌గ్రేడ్ చేయడం కోసం ‘యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్’కు కేబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం 2,343 మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఫేజ్-1 సైట్లను 2జి నుండి 4జి మొబైల్ సేవలకు రూ. 1,884.59 కోట్ల అంచనా వ్యయంతో అప్‌గ్రేడ్ చేయనున్నారు. తొలి ఐదేళ్లపాటు వీటి నిర్వహణ వ్యయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వమే భరించనుంది. తదుపరి ఐదేళ్లు బిఎస్ఎన్ఎల్ తన సొంత ఖర్చుతో ఈ సైట్లను నిర్వహిస్తుంది. రూ. 541.80 కోట్ల అంచనా వ్యయంతో ఐదు సంవత్సరాల కాంట్రాక్ట్ వ్యవధికి మించి పొడిగించిన కాలానికి నిర్వహణ ఖర్చుకు నిధులు సమకూర్చడానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు ద్వారా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలతో పాటు భద్రతాసిబ్బంది సైతం 4జీ ఇంటర్నెట్ సేవలను అందుకోనున్నారు.

ఫాస్ఫేట్, పొటాష్ ఎరువులపై సబ్సిడీ రేట్లకు ఆమోదం.. గతం కంటే 50 శాతం పెరిగిన సబ్సిడీ భారం
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో ఫాస్ఫేట్, పొటాష్ ఆధారిత ఎరువులపై సబ్సిడీ రేట్లకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంపై రూ. 60,939.23 కోట్ల మేర సబ్సిడీ భారం పడనుంది. గత ఏడాదితో పోల్చితే ఇది 50% అధికమని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశీయంగా తయారుచేసే ఎరువులకు రవాణా ఖర్చుల రూపంలో సబ్సిడీ అందించనున్నట్టు పేర్కొంది. అలాగే దిగుమతి చేసుకునే డీఏపీ, దేశీయంగా తయారుచేసే ఎరువులకు అదనపు సహాయం కూడా కేంద్రం అందజేయనున్నట్టు వివరించింది. ముడిసరుకు ధరలు పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన డీఏపీ ధరల భారాన్ని కేంద్ర ప్రభుత్వం భరించనుంది. అంటే ఇప్పటి వరకు ప్రతి బస్తా డీఏపీపై భరిస్తున్న రూ. 1,650 సబ్సిడీని రూ. 2,501కు కేంద్రం పెంచింది.

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఏర్పాటు
పోస్టాఫీసుల్లో ఇప్పటికే వివిధ రకాల బ్యాంకింగ్ సేవలు అందిస్తుండగా, పేమెంట్స్ బ్యాంకు ఏర్పాటు చేసేందుకు సిద్ధం చేసిన సవరించిన అంచనాలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తొలుత రూ. 1,435 కోట్లతో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఏర్పాటుచేయాలని భావించినప్పటికీ, ప్రాజెక్టు కార్యరూపం దాల్చడానికి మరింత అదనంగా నిధులు అవసరమవుతాయని అంచనా వేశారు. దీంతో సవరించిన అంచనాలు రూ. 2,255కు చేరుకోగా, ఆ మొత్తానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రెగ్యులేటరీ ఖర్చులు, అవసరాల కోసం భవిష్యత్తులో మరో రూ. 500 కోట్లు ఇచ్చేందుకు కూడా మంత్రివర్గం ఓకే చెప్పింది.

చీనాబ్ నదిపై జల విద్యుత్ కేంద్రం
జమ్ము-కశ్మీర్‌లో కిష్త్‌వార్ జిల్లాలో చీనాబ్ నదిపై 540 మెగావాట్ల సామర్థ్యం కల్గిన క్వార్ జల విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ. 4,526.12 కోట్లతో నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ (NHPC), జమ్ము కశ్మీర్ స్టేట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ సంయుక్తంగా చీనాబ్ వ్యాలీ పవర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను ఏర్పాటు చేసి 54 నెలల్లో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేయనున్నాయి. ఏడాది మొత్తమ్మీద 90శాతం నీటి లభ్యతను లెక్కిస్తూ 1,975.54 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేపట్టేలా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement