నైరోబి -. పశ్చిమ కెన్యాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 48 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడినట్టు స్థానిక పోలీసులు వెల్లడించారు.
ఓ ట్రక్ అదుపుతప్పి ఇతర వాహనాలను ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది.వివరాల ప్రకారం.. పశ్చిమ కెన్యాలో రద్దీగా ఉండే లొండియాని జంక్షన్‌లో ఓ ట్రక్కు అదుపుతప్పి ఇతర వాహనాలను ఢీ కొనడంతోపాటు పాదచారులపైకి దూసుకెళ్లింది. కెరిచో- నకురు పట్టణాల మధ్య హైవేపై ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 48 మంది మృతి చెందినట్లు గుర్తించామని స్థానిక పోలీసులు తెలిపారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు.
. దీంతో, గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు. పలు మినీబస్సుల శిధిలాలు,బోల్తా పడిన ట్రక్కులో కార్మికులు చిక్కుకుపోయారని పోలీసులు చెబుతున్నారు. దీంతో, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు.అయితే, రోడ్డుపై అధిక వేగంతో వెళ్తున్న ట్రక్కు అదుపుతప్పడంతో ఎనిమిది వాహనాలను, బైక్‌లను, పాదచారులను ఢీకొట్టింది. లోండియాని జంక్షన్ రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో భారీగా ప్రాణనష్టం జరిగింది.