Tuesday, November 26, 2024

హిమాచల్‌లో 476 రోడ్లు మూసివేత..!

భారీ హిమపాతంతో ఉత్తరాది రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించింది. పగటి ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. రహదారులపై దృశ్యమాపకత తగ్గింది. రవాణా నిలిచిపోయింది. హిమాచల్‌ప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు మైనస్‌ 8.3 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి. రోడ్లపై భారీగా హిమపాతం పేరుకుపోయింది. దీంతో జాతీయ రహదారులు సహా 476 రోడ్లను అధికారులు మూసివేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నీరు, విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోహ్‌తంగ, అటల్‌ సొరంగం వంటిచోట్ల 75 సెంటీమీటర్ల మేర మంచు కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లో అధికారులు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండోలి, సివ్లూ తదితర ప్రాంతాలను మంచు దుప్పటి కప్పేసింది.

నరకంద ప్రాంతంలో పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఇల్లు, వాహనాలను మంచు కప్పేసింది. అక్కడ రోడ్లుకు ఇరువైపులా భారీగా మంచు పేరుకుపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం నెలకొంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తరాఖండ్‌లోని గఢ్‌వాల్‌ ప్రాంతంలోనూ పెద్దఎత్తున మంచు పడుతోంది. జోషీమఠ్‌, బద్రినాథ్‌, కేదార్‌నాథ్‌, గంగోత్రి తదితర ప్రాంతాలు మంచు దుప్పట్లోనే ఉన్నాయి. మరోవైపు జమ్ము-కాశ్మీర్‌లోనూ భారీగా మంచు కురుస్తోంది. శ్రీనగర్‌, రాజౌరి, సోన్‌మార్గ్‌, బందీపురాతో పాటూ చాలా ప్రాంతాల్లో రోడ్లపై మంచు పేరుకుపోయింది. గుల్‌మార్గ్‌, పహిల్‌గావ్‌ పర్యాటక రిసార్ట్‌లు మంచుతో నిండిపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement