హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణకు పొరుగున ఉన్న మహారాష్ట్రలోని పూణేలో బీఏ4, బీఏ5 కరోనా వేరియంట్ కేసులు నమోదవడంతో సరిహద్దు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లా వైద్యాధికారులను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి హరీష్‌రావు అప్రమత్తం చేశారు. తాజాగా బీఏ4, బీఏ5 వేరియంట్ కేసులను మహారాష్ట్రలోని ఏడుగురు వ్యక్తుల్లో గుర్తించారు. కరోనా మొదటి, రెండో వేవ్‌లలో వైరస్ మహారాష్ట్ర నుంచి తెలంగాణకు దిగుమతి కావడంతో బీఏ4, బీఏ5 వేరియంట్ల వ్యాప్తి విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలని మహారాష్ట్రతో సరిహద్దు ఉన్న జిల్లాల వైద్యాధికారులను ఆదేశించారు. ఈ వేరియంట్లు సోకితే తీవ్ర అనారోగ్యం, ప్రాణాపాయం లేకున్నా… వేగంగా వ్యాప్తి చెందే గుణం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
ఈ నెల ఆరంభంలో బీఏ4 తొలి కేసును దేశంలోనే మొదటిసారిగా హైదరాబాద్‌లో గుర్తించారు. కొత్త వేరియంట్ ఉనికిలో ఉన్న దక్షిణాఫ్రికా నుంచి తెలంగాణ వచ్చిన ఒక ప్రయాణికుడికి హైదరాబాద్‌లో కరోనా పరీక్షలు నిర్వహించగాబీఏ4 వేరియంట్ సోకినట్లు తేలింది. ఆ తర్వాత తమిళనాడులోనూ బీఏ4, బీఏ5 కేసులు వెలుగులోకి వచ్చాయి.
తెలంగాణలో కరోనా సబ్ వేరియంట్ బీఏ.2 వైరస్ వ్యాప్తిలో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చింది. రాస్ట్రంలో బీఏ4,బీఏ5 కేసులు కూడా ఒక్కోటి చొప్పున నమోదయ్యాయని తేల్చింది. బీఏ.2 వేరియంట్ కేసులు 72శాతం మేర తెలంగాణలో వ్యాప్తి లో ఉన్నట్లు డబ్ల్యూహెచ్‌వో సర్వేలో తేలింది. మొత్తం 66 శాంపిళ్లను పరిశీలించగా అందులో 45 కేసులు బీఏ.2వి కాగా… ఒక్కోటి చొప్పున బీఏ4, బీఏ5 కేసులు నమోదయ్యాయి. మరోవైపు దేశంలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు బీఏ4, బీఏ5 కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.
కొత్తగా 43 కరోనా కేసులు..
తెలంగాణలో తాజాగా 43 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి కోలుకోవడంతో మరో 45 మంది డిశ్చార్జి అయి ఇళ్లకు వెళ్లారు. గడిచిన 24 గంటల్లో మొత్తం 11984 టెస్టులు చేయగా 43 కేసులు వెలుగు చూశాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ డా. జీ. శ్రీనివాసరావు శనివారం కరోనా హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..