న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌లో 42 విదేశీ సంస్థలు క్రియాశీలకంగా పని చేస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మనదేశంలో విదేశీ కంపెనీల మూసివేతకు సంబంధించి వైఎస్సార్సీపీ పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్‌సభలో అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి జవాబిచ్చారు. భారతదేశంలో నమోదిత 5,068 విదేశీ సంస్థల్లో సెప్టెంబర్ 2022 నాటికి కేవలం 3,291 విదేశీ కంపెనీలు మాత్రమే క్రియాశీలకంగా ఉన్నాయని, అందులో 42 విదేశీ కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపారాన్ని సాగిస్తున్నాయని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లిఖితపూర్వక సమాధానమిచ్చింది.
2014 నుంచి నవంబర్ 2021 మధ్యకాలంలో 877 విదేశీ కంపెనీలు భారతదేశంలో తమ కార్యకలాపాలను నిలిపివేసినట్లు గణాంకాలు చెబుతున్నాయన్నారు. కంపెనీలు సులభంగా, సమర్థవంతంగా రిటర్న్‌లు దాఖలు చేయడానికి పోర్టల్‌ను ప్రారంభించినట్టు తెలిపారు.