Tuesday, November 26, 2024

ప్రభుత్వ బ్యాంకుల్లో 41 వేల ఖాళీలు: నిర్మలా సీతారామన్​…

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొత్తం 41,177 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. లోక్‌సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆమె లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఈ బ్యాంకులకు మంజూరు చేసిన మొత్తం పోస్టుల్లో ఇది 5 శాతానికి సమానం. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొత్తం 8,05,986 ఉద్యోగాలు ఉన్నాయి. ఎస్‌బీఐలో అత్యధికంగా 8,544 ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీలు ఉన్నాయని, దీంతో ఉన్న ఉద్యోగులపై పని తీవ్రత అధికంగా ఉంటోందని.. ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలని ఓ సభ్యుడు ప్రశ్నించాడు. డిసెంబర్‌ 1 నాటికి బ్యాంకులకు కేటాయించిన పోస్టుల్లో 95 శాతం భర్తీ అయ్యాయని నిర్మలా సీతారామన్‌ అన్నారు.

మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఆఫీసర్‌, క్లర్క్‌, సబ్‌ స్టాఫ్‌ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో 6,743, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 6,295, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకులో 5,112, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 4,848 ఖాళీలు ఉన్నట్టు నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఆరేళ్లలో పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంకులో ఒక పోస్టు తగ్గించామని, మిగిలిన బ్యాంకుల పోస్టుల్లో ఎటువంటి కోత విధించలేదని వివరించారు. బ్యాంకులు, వాటి అవసరాలకు తగినట్టు నియామకాలు చేపడుతున్నామని సీతారామన్‌ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement