తెలుగు సినిమా చరిత్రలోనే ప్రముఖుడిగా ప్రసిద్ధి చెందారు దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు. మద్రాసు నుంచి హైదరాబాద్ లో తెలుగు సినీ పరిశ్రమను నెలకొల్పడంలో ముఖ్య పాత్ర పోషించారు. అంతటి గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ అక్కినేని నాగేశ్వర్ రావు నటించిన ఓ చిత్రం గతంలో విడుదలకు నోచుకోలేదు. ప్రస్తుతం ఆ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. 1982లో దివంగత నటుడు అక్కినేని నాగేశ్వర్, జయసుధ కలిసి నటించిన చిత్రం ప్రతిబింబాలు . 40 ఏండ్ల కింద ఈ చిత్రాన్ని సీనియర్ ప్రొడ్యూసర్ జాగర్లమూడి రాధాకృష్ణ నిర్మించారు. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు.
విష్ణుప్రియా సినీకంబైన్స్ బ్యానర్ పై రూపుదిద్దుకున్న ఈ చిత్రం అప్పట్లో కొన్ని కారణాల ద్వారా థియేటర్లలో రిలీజ్ కాలేకపోయింది. ప్రస్తుతం ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా సీనియర్ ప్రొడ్యూసర్ జాగర్లమూడి రాధాకృష్ణ ‘ప్రతిబింబాలు’ రీ రిలీజ్ ను తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ.. అప్పట్లో అనేక కారణాలతో ‘ప్రతిబింబాలు’ను ప్రదర్శించలేకపోయాం. ఇప్పుడున్న అధునాతన టెక్నాలజీతో లేటెస్ట్ వెర్షన్ లో రిలీజ్ చేయబోతున్నాం. నవంబర్ 5న 250 థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కు ఏర్పాట్లు కూడా చేసినట్టు తెలిపారు. ‘ప్రతిబింబాలు’ కూడా సక్సెస్ ఫుల్ గా నిలుస్తుందని ఆకాంక్షించారు. ప్రస్తుతం యంగ్ హీరోల సినిమాలు రీరిలీజ్ అవుతున్నాయి. మరోవైపు పాన్ ఇండియా హీరోల ట్రెండ్ నడుస్తున్న సమయంలో 80లోని ‘ప్రతిబింబాలు’ రిలీజ్ కాబోతుండటం విశేషం.మరి ఈ చిత్రాన్ని జనం ఏ మేరకు ఆదరిస్తారో చూడాలి.