ఛత్తీస్‌గఢ్‌లో మరో రెండు రోజుల్లో లోక్‌సభ ఎన్నికల తొలి దశ ప్రారంభం కానున్న వేళ.. తాజా ఎన్‌కౌంటర్‌తో దండకారణ్యం దద్దరిల్లింది. పచ్చని అడవి ఎరుపెక్కింది. బస్తర్ రీజియన్‌లోని కాంకేర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో దాదాపు 40 మంది మావోయిస్టులు హతమయ్యారని అనధికారిక వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు 29 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని అధికారులు ధ్రువీకరించారు.
అయితే ఈ సంఖ్య మరింత పెరుగొచ్చని చెప్పారు. రాష్ట్రంలో జరిగిన అతిపెద్ద ఎన్‌కౌంటర్ ఇదేనని పోలీసులు చెబుతున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు నాలుగు నెలల వ్యవధిలో బస్తర్ రీజియన్‌లో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 79 మంది మావోయిస్టులు మరణించారు.
మృతుల్లో మావోయిస్టు అగ్రనేత తెలంగాణలోని భూపాలపల్లి జయశంకర్ జిల్లాకు చెందిన శంకర్‌రావు కూడా ఉన్నారని తెలుస్తోంది. ఆయనపై రూ.25 లక్షల రివార్డు ఉన్నది. ఎన్‌కౌంటర్ ఘటనాస్థలి నుంచి భారీ యెత్తున ఏకే-47లు, ఎస్‌ఎల్‌ఆర్, ఇన్‌సాస్ రైఫిళ్లు, కార్బైన్, 303 రైపిల్స్, ఇతర ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకొన్నారు. ఈ ఘటనలో బీఎస్‌ఎఫ్ ఇన్‌స్పెక్టర్ సహా ఇద్దరు జవాన్లకు కూడా గాయాలయ్యాయి. వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నదని, చికిత్స కోసం దవాఖానకు తరలించినట్టు బస్తర్ రేంజ్ ఐజీపీ పీ సుందర్‌రాజ్ పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్ ఘటనను నక్సలిజంపై సర్జికల్ స్రైక్‌గా ఛత్తీస్‌గఢ్ హోంమంత్రి విజయ్ శర్మ అభివర్ణించారు.
పక్కా సమాచారంతో సెర్చ్ ఆపరేషన్
ఎన్‌కౌంటర్ ఘటనకు సంబంధించిన వివరాలను బస్తర్ రేంజ్ ఐజీ సుందర్‌రాజ్ వెల్లడించారు. కాంకేర్ జిల్లాలో మావోయిస్టులు భారీ ప్లీనరీకి సమాయత్తమవుతున్నట్లు పోలీస్ అధికారులకు సమాచారం అందింది. సీపీఐ(మావోయిస్టు) బస్తర్ డివిజన్ నేతలు శంకర్, లలిత, రాజు తదితరులు హాజరవుతున్నారని తెలిసింది. దీంతో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్‌ఎఫ్), జిల్లా రిజర్వు గార్డు(డీఆర్‌జీ), రాష్ట్ర పోలీసులు, ఇతర భద్రతా దళాలు సంయుక్తంగా చోటేబేథియా పోలీస్‌స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో యాంటీ మావోయిస్టు ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో బీనగుండా-కొరగుట్ట అటవీ ప్రాంతంలో భారీ సంఖ్యలో సాయుధ మావోయిస్టులు తారసపడి జవాన్లపైకి ఒక్కసారిగా కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురు కాల్పులకు దిగి, మావోయిస్టులను చంపేశారు. ఘటనాస్థలంలో మావోయిస్టుల మృతదేహాలతోపాటుగా భారీయెత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలు ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకొన్నారు.
ఎగువ ప్రాంతం నుంచి కాల్పులు
మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ఎన్‌కౌంటర్ ప్రారంభమైనట్టు సమాచారం. భద్రతా బలగాలు ఎత్తైన ప్రాంతం నుంచి కాల్పులు చేయడంతో కింది ప్రదేశంలో ఉన్న మావోయిస్టులు తప్పించుకొనేందుకు అవకాశం లేకుండా పోయిందని తెలిసింది. రెండు వర్గాల మధ్య సుమారు 4 గంటలపాటు ఎదురు కాల్పులు జరిగినట్టు తెలుస్తున్నది. కాల్పుల అనంతరం మావోయిస్టులు పారిపోయిన తర్వాత భద్రతా దళాలు ఘటనాస్థలాన్ని చుట్టుముట్టి గాలింపు చర్యలు చేపట్టాయి.
ఏజెన్సీ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్
ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టుల్లో డివిజన్ కమిటీ సభ్యులు నలుగురు ఉన్నట్లు తెలుస్తున్నది. ఇందులో ఒకరు తెలంగాణలోని భూపాలపల్లి జయశంకర్ జిల్లా చిట్యాల మండలం చల్లగరిగె గ్రామానికి చెందిన శంకర్‌రావు అలియాస్ మురళి అలియాస్ శ్రీపల్లి సుధాకర్ కాగా.. మరొకరు బీజాపూర్ జిల్లా భామర్‌గఢ్ ప్రాంతానికి చెందిన లలితగా గుర్తించినట్లు సమాచారం. అయితే ఎన్‌కౌంటర్‌లో పలువురు మావోయిస్టు ముఖ్య నేతలు మృతిచెందినట్లు వస్తున్న వార్తలపై ఉన్నతాధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. తాజా ఘటన నేపథ్యంలో పోలీస్ అధికారులు ఛత్తీస్‌గఢ్ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను అప్రమత్తం చేశారు.
కాంకేర్‌లో 26న లోక్‌సభ ఎన్నికలు
ఈనెల 19 నుంచి లోక్‌సభ ఎన్నికల మొదటి దశ ప్రారంభం కానున్న నేపథ్యంలో తాజా ఎన్‌కౌంటర్ ప్రాధాన్యం సంతరించుకొన్నది. మావోయిస్టు ప్రభావిత బస్తర్ లోక్‌సభ నియోజకవర్గంలో తొలి దశ ఎన్నికల్లో భాగంగా 19న పోలింగ్ జరుగుతుంది. అదేవిధంగా తాజా ఎన్‌కౌంటర్ జరిగిన కాంకేర్ లోక్‌సభ స్థానానికి రెండో దశ పోలింగ్‌లో భాగంగా ఈనెల 26న ఎన్నికలు జరుగుతాయి. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఏ ఎన్నిక అయినా ఓటింగ్ శాతం తక్కువ ఉంటున్నది.
వరుస ఎన్‌కౌంటర్లలో పదుల మరణాలు
ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య జరుగుతున్న పోరులో పదుల సంఖ్యలో మావోయిస్టులు మరణిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టు ప్రభావిత బస్తర్ రీజియన్‌లో ఈ ఏడాది ఇప్పటి వరకు నాలుగు నెలల వ్యవధిలో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 79 మంది మావోయిస్టులు మరణించారని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఈ నెల 2న బీజాపూర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 13 మంది నక్సలైట్లు మృతిచెందారు.
ఐదేండ్లలో అతిపెద్ద ఎన్‌కౌంటర్ ఇదే!
గత ఐదేండ్లలో జరిగిన ఎన్‌కౌంటర్లలో ఇదే అతిపెద్దదిగా తెలుస్తున్నది. 2018 ఆగస్టులో ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో 15 మంది మావోయిస్టులు చనిపోయారు. అదే ఏడాది మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా రేల్-కస్నాసుర్ అడవుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో సుమారు 40 మంది మావోయిస్టులు మరణించారు. మళ్లీ 2021 నవంబర్‌లో గడ్చిరోలిలో జరిగిన యాంటీ మావోయిస్టు ఆపరేషన్‌లో భాగంగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో 26 మంది మావోయిస్టులు మృతిచెందారు. 2016లో 30 మంది నక్సలైట్లను గ్రేహౌండ్స్ బలగాలు చంపేశాయి.
నక్సలిజం అతిపెద్ద శత్రువు: అమిత్‌షా
ఛత్తీస్‌గఢ్ తాజా ఎన్‌కౌంటర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పందించారు. ఆపరేషన్ విజయవంతంగా సాగిందని పేర్కొన్న ఆయన.. భద్రతా సిబ్బంది ధైర్య సాహసాలను ప్రశంసించారు. దేశాభివృద్ధి, శాంతి భద్రతలు, యువత ఉజ్వల భవిష్యత్తుకు నక్సలిజం అతిపెద్ద శత్రువు అని అన్నారు. దేశానికి నక్సలిజం నుంచి విముక్తి కల్పించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించిందని చెప్పారు. కాల్పుల్లో గాయపడిన భద్రతా సిబ్బంది కోలుకోవాలని అమిత్‌షా ఎక్స్ వేదికగా ఆకాంక్షించారు.
ఆపరేషన్‌కు ఎస్పీ ఇంద్ర కల్యాణ్ నాయకత్వం
తాజా ఎన్‌కౌంటర్‌కు కాంకేర్ జిల్లా ఎస్పీ ఇంద్ర కల్యాణ్ ఎలీషా నాయకత్వం వహించారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు మావోయిస్టులు భారీ విధ్వంసానికి కుట్ర పన్నారనే సమాచారం భద్రతా దళాలకు నిఘా వర్గాలు అందించాయని ఆయన తెలిపారు. అడవుల్లో వంద మందికిపైగా మావోయిస్టులు ఏర్పాటు చేసుకొన్న క్యాంపును భద్రతా బలగాలు గుర్తించి, సోమవారం సాయంత్రం ఆపరేషన్ ప్రారంభించాయని పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం కొండపైకి చేరుకొని కాల్పులు మొదలు పెట్టాయని వివరించారు.