న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాలుగు జాతీయ జల పురస్కారాలు వరించాయి. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ శనివారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్కడ్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, సహాయ మంత్రులు బిశ్వేశ్వర్ తుడు, ప్రహ్లాద్ సింగ్ పటేల్ తదితరులు పాల్గొని పురస్కారాలను ప్రదానం చేశారు. 11 విభాగాలలో పూరస్కారాలు ప్రదానం చేయగా ఉత్తమ రాష్ట్ర విభాగంలో మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్-బీహార్ (సంయుక్తంగా) మొదటి మూడు స్థానాలలో నిలిచాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున జల వనరుల అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశి భూషణ్ కుమార్ అవార్డును అందుకున్నారు. ఉత్తమ పాఠశాల విభాగంలో నంద్యాల జిల్లా చాగలమర్రిలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ రెండవ స్థానం, ఉత్తమ పరిశ్రమల విభాగంలో తిరుపతికి చెందిన సీసీఎల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మూడవ స్థానంలో నిలిచాయి. ఉత్తమ ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థల విభాగంలో అనంతపురంలోని ఆక్టా ఫ్రెటర్నా ఎకాలజీ సెంటర్‌కు స్పెషల్ కన్సొలేషన్ ప్రైజ్ లభించింది.