Saturday, November 23, 2024

Delhi | ఏపీ శకటానికి తృతీయ ఉత్తమ బహుమతి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రదర్శించిన శకటాల్లో ఆంధ్రప్రదేశ్ శకటానికి తృతీయ బహుమతి లభించింది. కేంద్ర రక్షణశాఖ సహాయ మంత్రి అజయ్ భట్ చేతుల మీదుగా ఈ బహుమతిని ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్, సమాచార శాఖ జాయింట్ డైరక్టర్ కిరణ్ కుమార్ స్వీకరించారు. పీపుల్స్ ఛాయిస్ విభాగంలో ఏపీ శకటానికి, అలాగే ఏపీ కళాకారుల ప్రదర్శనకు తృతీయ బహుమతి లభించింది.

రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న శకటాలకు జ్యూరీతో పాటు దేశవ్యాప్తంగా నిర్వహించిన  ప్రజాభిప్రాయాన్ని కూడా సేకరించి ర్యాంకులను నిర్ణయించింది. ఆ క్రమంలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన శకటాలకు రిపబ్లిక్ డే క్యాంపులో రక్షణ శాఖ  మంగళవారం బహుమతుల ప్రధానోత్సవం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ శకటంపై ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా డిజిటల్ విద్యా బోధన, నాడు-నేడు, ఇంగ్లిష్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, ఆంగ్ల మాధ్యమంలో బోధన ఇతవృత్తాన్ని ప్రదర్శించేలా రూపకల్పన చేశారు.

- Advertisement -

దానికి తగినవిధంగా సకల విద్యలకు మేమే సాటి…విశ్వ విద్యకు మేమే పోటీ, డిజిటల్ చదువులే భవితకు తరగని ఆస్తి.. ఇది మా డిజిటల్ క్లాస్ రూమ్ … ఆట పాటల అక్షర దోస్తీ .. అఆ ఇఈ అంటూ పలక బలపం పట్టాం.. ABCD అంటూ ఇంగ్లీష్ మీడియం తెచ్చాం.. ట్యాబులను చేతినపట్టి విశ్వ విద్యను నేర్పాము…దేశ ప్రగతికిది సోపానం .. విశ్వ విద్యే మా లక్ష్యం… జయహో ఆంధ్రప్రదేశ్.. అంటూ సంగీతంతో కూడిన నేపథ్యగీతాన్ని కూడా ఆలపించారు.

ఈ ప్రదర్శనపై జనవరి 26, 27 తేదీల్లో దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో ఏపీ శకటం మూడవ ర్యాంకు సాధించింది. తొలి స్థానంలో గుజరాత్ ప్రభుత్వం రూపొందించిన  శకటం నిలవగా.. ద్వితీయ స్థానంలో యూపీ శకటం నిలిచింది. ఇదే కాకుండా రిపబ్లిక్ డే వేడుకల్లో  భాగంగా జరిగిన సాంస్కృతిక ప్రదర్శనల్లో సైతం ఆంధ్రప్రదేశ్ కు తృతీయ స్ధానం లభించింది. దీనిని పురస్కరించుకొని ఆంధ్ర ప్రదేశ్ కళాకారులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement